
హైదరాబాద్, వెలుగు: పీసీసీ విసృతస్థాయి సమావేశాన్ని సోమవారం జరగనున్నది. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించే ఈ మీటింగ్‌కు రాష్ట్ర వ్యవహారా ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అటెండ్ కానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జిలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు– జై భీమ్– జై సంవిధాన్ కో ఆర్డినేటర్లు, సభ్యులు, జిల్లా కమిటీ కో ఆర్డినేటర్లకు పిలుపు అందింది.
ఈ మీటింగ్‌లో పార్టీ బలోపేతం, త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్ గౌడ్ దిశా నిర్దేశం చేయనున్నారు. పీసీసీ చీఫ్‌గా ఏడాది టర్మ్ పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్.. గత ఏడాది కాలంలో చేపట్టిన పార్టీ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచడానికి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు , ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపడం, పార్లమెంట్‌లో రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోవడాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ భావిస్తున్నది. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
సీఎంను కలిసిన పీసీసీ చీఫ్
పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకొని ఏడాది పూర్తైన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మహేశ్‌కుమార్‌గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఏడాది కాలంలో పార్టీ ప్రెసిడెంట్‌గా వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంపై పీసీసీ చీఫ్‌ను సీఎం అభినందించారు.