తుర్కియే, అజర్ బైజాన్​కు దెబ్బ మీద దెబ్బ.. పాక్కు మద్దతిచ్చిన రెండు దేశాలకు భారత ట్రేడర్ల షాక్లు

తుర్కియే, అజర్ బైజాన్​కు దెబ్బ మీద దెబ్బ.. పాక్కు మద్దతిచ్చిన రెండు దేశాలకు భారత ట్రేడర్ల షాక్లు
  • ఆ దేశాలతో అన్ని రకాల వ్యాపారాలు బంద్ చేయాలి
  • ఆల్ ఇండియా ట్రేడర్స్ సమావేశం తీర్మానం 
  • టూరిజం, సినిమా షూటింగ్​ల కోసమూ వెళ్లొద్దని పిలుపు 
  • ఆ దేశాల నుంచి పండ్లు, నగల దిగుమతులూ బంద్ 
  • అక్కడి వర్సిటీలతో ఎంఓయూలు రద్దు చేసుకుంటున్న వర్సిటీలు
  • ఇప్పటికే భారీగా పడిపోయిన టూరిజం బుకింగ్​లు

న్యూఢిల్లీ: భారత్ పైకి ఉగ్రమూకలను ఎగదోయడమే కాకుండా కయ్యానికి కాలుదువ్విన పాకిస్తాన్​కు ఏకపక్షంగా మద్దతు ప్రకటించిన తుర్కియే, అజర్ బైజాన్ దేశాలకు దెబ్బ మీద దెబ్బ తగుతులుతున్నది. చేసిన సాయాన్ని మరిచిపోయి పాక్​తో అంటకాగుతూ భారత్​పై విషం కక్కిన ఈ రెండు దేశాలకు మన వ్యాపారులు వరుస షాక్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ తుర్కియే, బాయ్ కాట్ అజర్ బైజాన్’ క్యాంపెయిన్ ఇప్పటికే ఊపందుకోగా.. ఇప్పుడు ఈ రెండు దేశాలతో అన్ని రకాల వ్యాపార సంబంధాలను కట్ చేసుకుంటున్నట్టు ఆల్ ఇండియా ట్రేడర్స్ సమావేశం తీర్మానం చేసింది. శుక్రవారం ఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 24 రాష్ట్రాలకు చెందిన 125 మందికిపైగా ట్రేడ్ లీడర్లు పాల్గొన్నారు.

తుర్కియే, అజర్ బైజాన్ దేశాలతో అన్ని రకాల వాణిజ్య, వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు సమావేశంలో  తీర్మానం చేశారు. ఆ దేశాల్లో సినిమా షూటింగ్​లు చేయవద్దని కూడా భారత సినీ పరిశ్రమకు సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అక్కడ ఏవైనా సినిమాలు తీస్తే ఆ చిత్రాలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. తుర్కియేకు చెందిన సెలెబీ ఎయిర్ పోర్టు సర్వీసెస్​ను కేంద్రం నిలిపివేయడాన్ని ఈ సమావేశం స్వాగతించింది. అలాగే ఈ రెండు దేశాలతో ట్రావెల్, టూరిజం, ట్రేడింగ్ వంటివి బాయ్ కాట్ చేయడంపై దేశవ్యాప్తంగా అవేర్ నెస్ క్యాంపెయిన్ చేపడతామని ప్రకటించింది. కాగా, సెలెబీకి కేంద్రం సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు నేపథ్యంలో శుక్రవారం ఆ కంపెనీ షేర్లు పది శాతం మేర పతనమయ్యాయి. 

వర్సిటీలతో ఒప్పందాలు రద్దు.. 
తుర్కియే, అజర్ బైజాన్​తో మన దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు వరుసగా ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని జేఎన్ యూ, జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) ఇదివరకే ప్రకటన చేయగా.. తాజాగా  ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), కాన్పూర్ లోని ఛత్రపతి సాహూజీ మహరాజ్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ్ లోని ఐఐటీ రూర్కీ, పంజాబ్ లోని  లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్ పీయూ) ఇదే తరహా ప్రకటనలు చేశాయి.    

తుర్కియే నగలూ బాయ్ కాట్.. 
తుర్కియే, అజర్ బైజాన్​తో అన్ని రకాల వ్యాపార సంబంధాలను రద్దు చేసుకోవాలని దేశవ్యాప్తంగా వ్యాపారులందరికీ ఆలిండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) శుక్రవారం పిలుపు నిచ్చింది. తుర్కియేను తాము కూడా బాయ్ కాట్ చేస్తున్నామని లక్నో నగల వ్యాపారులు ప్రకటించారు. ఇప్పటివరకూ అక్షయ తృతీయ సందర్భంగా నగల అమ్మకాల్లో తుర్కియే జ్యువెల్లరీకి బాగా డిమాండ్ ఉండేదని, తాజా పరిణామాల వల్ల ఆ దేశం నుంచి నగల దిగుమతులను నిలిపేస్తున్నామని చౌక్ సరఫా అసోసియేషన్ ప్రకటించింది. మన ఓటీటీల్లో టర్కిష్ టీవీ షోలు, సినిమాలను బ్రాడ్ కాస్ట్ చేయకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ డిమాండ్ చేసింది. తుర్కియే నుంచి యాపిల్ దిగుమతులను నిలిపివేస్తున్నట్టు ఢిల్లీలోని ఆజాద్​పూర్ మండి, రాజస్థాన్​లోని ఆల్వార్ ఫ్రూట్ మార్కెట్ ట్రేడర్లు ప్రకటించారు.

టూరిజం బాయ్ కాట్తో ఆ దేశాలకు రూ. వేల కోట్లు లాస్..
తుర్కియే, అజర్ బైజాన్ దేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని ఇదివరకే పలు ట్రావెల్, టూరిస్ట్ ఏజెన్సీలు ప్రకటించాయి. ఈ రెండు దేశాలకు భారతీయులు ఎవరూ వెళ్లొద్దంటూ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా సైతం పిలుపునిచ్చారు. నెటిజన్లు కూడా బాయ్ కాట్ తుర్కియే నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో నెల క్రితం వరకూ భారతీయులకు ఈ రెండూ టాప్ 5 టూరిస్ట్ ప్లేస్లలో ఉండేవని, ఇప్పుడు బుకింగ్స్ పడిపోతున్నాయని అంటున్నారు.

కేవలం ట్రావెల్, టూరిజం రంగాల్లో బాయ్ కాట్ చేయడం వల్లే ఆ దేశాలకు రూ. వేల కోట్ల నష్టం వాటిల్లనుందని వ్యాపార వర్గాల అంచనా. 2024లో భారతీయ ట్రావెలర్లు, టూరిస్టుల వల్ల తుర్కియేకు రూ. 4,200 కోట్లకుపైగా, అజర్​బైజాన్​కు రూ. 2,600 కోట్లకుపైగా లాభం చేకూరిందంటున్నారు. కాగా, గత ఏడాది తుర్కియే కు 2.74 లక్షల మంది, అజర్ బైజాన్ కు 2.43 లక్షల మంది ఇండియన్ టూరిస్టులు వెళ్లి వచ్చారు.