
- సూర్యాపేట మార్కెట్లో రైతుల గోస
- క్వింటాల్‌కు రూ. 1,400లే ఇస్తామన్న వ్యాపారులు
- ఇట్లయితే లాగోడి కూడా రాదని రైతుల ఆవేదన
- అర్ధరాత్రి వరకు వ్యాపారులతో కలెక్టర్ చర్చలు
- అయినా దిగిరాని వ్యాపారులు
సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో ఇదే అదనుగా ట్రేడర్లు, మిల్లర్లు రెచ్చిపోతున్నారు. రైతులను అందినకాడికి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వడ్లకు తక్కువ రేటు ఫిక్స్ చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటను అగ్గువకు అమ్ముకోలేక సూర్యాపేటలో మార్కెట్‌కు తెచ్చిన వడ్లను రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 4,500 బస్తాల వడ్లను వాపస్ తీసుకెళ్లారు. ఇందుకోసం ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 5 వేలు, హమాలీకి 2 వేల వరకు అదనంగా భరించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కలెక్టర్ చెప్పినా ట్రేడర్లు వినలే..
కోతలు ఊపందుకోవడంతో వారం రోజులుగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు భారీగా ధాన్యం వస్తున్నది. శుక్రవారం 24 వేల బస్తాల వడ్లు రావడంతో ట్రేడర్లు క్వింటాల్‌కు రూ. 1,900 చెల్లించి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో శనివారం రైతులు మరో 26,455 బస్తాల వడ్లను మార్కెట్‌కు తెచ్చారు. ఇందులో 16,413 బస్తాల సన్న వడ్లు, 10,042 బస్తాల దొడ్డు రకాలు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రేడర్లు, మిల్లర్లు కుమ్మక్కై మద్దతు ధర తగ్గించారు. సన్నాలకు కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ. 1,960 ఉండగా, ట్రేడర్లు మాత్రం రూ. 1,200 కు మించి చెల్లించలేమని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు శనివారం మార్కెట్ లో ఆందోళనకు దిగారు. వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మార్కెట్‌కు చేరుకొని ట్రేడర్లు ప్రకటించిన రేట్లను రద్దు చేసి రీటెండర్ వేయాలని ఆదేశించారు. కలెక్టర్ అర్ధరాత్రి వరకు ఉండి నిర్వహించిన రీ బిడ్డింగ్‌లో ట్రేడర్స్ క్వింటాల్‌కు రూ. 5, రూ. 10 వరకు నామమాత్రంగా పెంచారు. దీంతో రైతులు మరోసారి ఆందోళన చేయడంతో మిల్లర్లు, ట్రేడర్లు మాట్లాడుకొని రూ.1,400 చెల్లిస్తామన్నారు. రెండురోజుల్లో రూ.500 తగ్గించడంతో అన్నదాతలు తీవ్రంగా కలత చెందారు. ఆరుగాలం కష్టపడి ఇంత అగ్గువకు అమ్ముకుంటే, లాగోడి పైసలు కూడా రావని, దీనికంటే ఇండ్లలో పోసుకోవడం మేలనుకొని వడ్లను ఇండ్లకు తిరిగి తీసుకెళ్తున్నారు. గడిచిన రెండేండ్లుగా సన్న వడ్ల రేటు మద్దతు ధరను మించి రూ. 2 వేల నుంచి 2,300 దాకా పలుకుతున్నది. ఈసారి కూడా మంచి ధర వస్తుందనే ఆశతో వడ్లను మార్కెట్‌కు తెచ్చిన తమను మిల్లర్లు, ట్రేడర్లు ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు మద్దతుగా కాంగ్రెస్ దీక్ష.. భగ్నం
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం ఉదయం పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి మార్కెట్ లో వడ్ల కొనుగోళ్ల తీరును పరిశీలించారు. శుక్రవారం రూ. 1,900 చెల్లించిన ట్రేడర్స్ శనివారం రూ. 1,200 పెట్టడంలోని ఆంత్యరమేమిటని ఆయన ప్రశ్నించారు. శనివారం రైతులు అంత పెద్ద ఆందోళన చేపట్టినా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ మార్కెట్‌ను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. మిల్లర్లు, ట్రేడర్లతో చైర్ పర్సన్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. అక్కడే దీక్షకు దిగగా.. రాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో ఉన్న పటేల్ రమేశ్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.