రూ. 7 వేల నుంచి రూ.3500 వరకు పడిపోయిన పల్లి రేటు

రూ. 7 వేల నుంచి రూ.3500 వరకు పడిపోయిన పల్లి రేటు

అచ్చంపేట, వెలుగు: పల్లి రైతులను ట్రేడర్లు ముంచుతున్నారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో రేటు తగ్గిస్తున్నారు. ఆన్​లైన్​టెండర్ల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తుండటంతో ట్రేడర్లు స్థానిక మార్కెట్​యార్డులలో ఉండే కమీషన్​ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఉదయం మార్కెట్​కు రైతులు పల్లి తీసుకురాగానే ఏజెంట్లు ముందుగా గింజను పరిశీలించి ట్రేడర్లకు సమాచారం అందిస్తున్నారు. అనంతరం ట్రేడర్లు ఫలానా బొడ్డెకు(వేరుశనగ కుప్ప) ఇంత రేట్​అని ఫిక్స్​చేస్తున్నారు. సాయంత్రం మూడు గంటల తర్వాత ఆ పంట కొంటున్నారు. ఉదయం నుంచి మార్కెట్ల వద్ద వేచి చూస్తున్న రైతులు రోజంతా ఎదురుచూసి తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక ట్రేడర్లు చెప్పిన రేట్​కు వారి చేతిలో పెడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్​నగర్, బాదేపల్లి, అచ్చంపేట, వనపర్తి, గద్వాలలో యాసంగి వేరుశనగ కొనుగోళ్లు డిసెంబరు నుంచి మొదలై మార్చి చివరివారం వరకు కొనసాగుతాయి. ఈ సీజన్​లో కూడా డిసెంబరు నుంచి సీజన్​ మొదలైంది. డిసెంబరులో 992 క్వింటాళ్లు, జనవరిలో 76,361, ఫిబ్రవరిలో 2,10,519 క్వింటాళ్ల పల్లిని రైతులు మార్కెట్​లో విక్రయించారు. రూ. 3 వేల నుంచి రూ. 6,700 వరకు ధర దక్కింది. వారం కిందటి వరకు కూడా క్వింటాల్​కు గరిష్ఠంగా రూ.6,600 వరకు చెల్లించారు. కానీ మూడు రోజుల నుంచి రేట్లను తగ్గించారు. తాజాగా మంగళవారం క్వింటాల్ పల్లి రూ.3,500 నుంచి రూ.6,060 వరకు పలికింది. గతేడాది ఫిబ్రవరిలో అత్యధికంగా క్వింటాల్​కు రూ. 7,729 వరకు చెల్లించారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం రైతులకు క్వింటాల్​కు రూ. 1,600 వరకు ఆదాయం తగ్గింది. 

పంట ఎక్కువ వచ్చిందని..

పంట మార్కెట్లకు ఎక్కువగా వచ్చే టైంలోనే ట్రేడర్లు రేట్లను డౌన్​చేస్తున్నారు. సీజన్​ ఉన్నంతకాలం క్వింటాల్​ వేరుశనగ ధర రూ.6,500 రూ.7 వేలకు మించడం లేదు. సీజన్ ముగిసేలోపు ట్రేడర్లు రైతుల నుంచి పంట మొత్తం కొని గోదాములు, మిల్లులో నిల్వ చేసుకుంటున్నారు. మే నెల నుంచి నేషనల్​మార్కెట్​మొదలవుతుండడంతో అక్కడ ఈ పంటను అమ్మి క్వింటాల్​కు రూ.8 వేల నుంచి రూ.9 వేల ధర పొందుతున్నారు. కొందరు ఆయిల్ మిల్లులతో ఒప్పందాలు చేసుకొని అక్కడికి పల్లిని తరలిస్తున్నారు. మరికొందరు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, లక్నో, గుర్గావ్, ఇంకొందరు చెన్నై పోర్ట్ మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

రోడ్డెక్కుతున్న రైతులు 

ఎకరాలో పల్లి సాగు, మార్కెట్​కు పంట తరలించడానికి రూ. 38 వేల దాకా ఖర్చవుతోంది. విత్తు పెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చేవరకు ఆరుగాలం శ్రమించాలి. అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి రేయింబవళ్లు కాపలా ఉండాలి. అన్నీ కలిసి వస్తే ఎకరాకు ఐదు నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అయితే వ్యాపారులు అరకొర ధర చెల్లిస్తుండడంతో రైతులకు కనీసం పెట్టుబడులు కూడా ఎల్లడం లేదు. వ్యాపారులు సిండికేట్​గా మారి ధరను నిర్ణయించి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం అచ్చంపేటలో రైతులు ఆందోళనకు దిగారు.  శ్రీశైలం –- అచ్చంపేట మెయిన్​రోడ్డుపై అంబేద్కర్​చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. వేరుశనగ పంటను, ఖాళీ బస్తాలను కాల్చి నిరసన తెలిపారు. గురువారం కల్వకుర్తి మార్కెట్​లోనూ రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళన తర్వాత వ్యాపారులు క్వింటాల్​కు రూ. 50 పెంచారు. ఒక్కరోజు మార్కెట్​లో కుప్పలకు కాపలాగా ఉంటే రూ.500 వరకు ఖర్చవుతోందని రూ.50 పెంచి బిచ్చగాళ్లకంటే అధ్వానంగా చూస్తున్నారని  రైతులు వాపోతున్నారు.  

రూ.5,400 ఇచ్చిన్రు

ఎకరా పొలం ఉంది. యాసంగిలో పల్లి వేసిన. క్వింటాల్​విత్తనాలు చల్లితే మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తెగులు సోకడంతో దిగుబడి తగ్గింది. ఐదు రోజుల కిందటి దాకా రేట్​ రూ.6,600 నుంచి రూ.6,800 వరకు ఉండే. రెండు రోజుల కిందట నేను పంటను మార్కెట్​కు తీసుకుపోతే.. సేటు ధర తగ్గించిండు. క్వింటాల్​కు రూ.5,400 మాత్రమే ఇచ్చిండు. ఆ రేట్​కు నాకు పెట్టబడి కూడా ఎల్లలే.
–లక్ష్మి, రైతు, చెంచుపలుగుతండా

మా ఒక్కరికే ఎక్కువ రేట్​ దక్కింది

నేను ఉస్మానియాలో ఎమ్మెస్సీ జియో ఫిజిక్స్​పూర్తి చేసిన. జాబ్​లేక మా నాన్నతో కలిసి వ్యవసాయం చేస్తున్న. ఈ సీజన్​లో పల్లి వేసినం. మూడు ఎకరాలకు 16 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. శనివారం వరకు రూ.7 వేలకుపైగానే రేట్​ఉండే. ఈ రోజు మా పంటను మార్కెట్​కు తీసుకెళ్తే ఆ రేట్​ లేదు. అత్యధికంగా మా పంటకే రూ.6,060 ధర చెల్లించారు. మిగతా రైతులకు రూ.3,500 నుంచి రూ.4,800 వరకు చెల్లించిన్రు. 
– పడమటి పృథ్విరాజ్​గౌడ్, కుల్కచర్ల