
- ఇప్పటి వరకు ఐదుగురి అరెస్ట్
- క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేసిన పోలీసులు
కోల్‌కతా: బెంగాల్‌లో ఒడిశాకు చెందిన మెడికో రేప్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగాల్ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఓ నిందితుడిని అతడి సోదరి ఇచ్చిన సమాచారం ఆధారంగానే పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులతోపాటు వారికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు మొదట అదు పులోకి తీసుకున్నారు.
వారు పారిపోయేందుకు సహకరించిన మరో యువకుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఐదో నిందితుడు సఫీక్ ఎస్‌కే.. దుర్గాపుర్‌లోని అండాల్ వంతెన కింద తలదాచుకున్నట్టు అతడి సోదరి సమాచారం అందించింది. దీంతో పోలీసులు అతడిని జాడను గుర్తించి, అరెస్ట్ చేశారు. కాగా, తన సోదరుడు చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలని, అతడి వల్ల తన కుటుంబం అవమానపడొద్దని నిందితుడి సోదరి పోలీసులకు తెలిపింది. కాగా, నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి బైక్ ఇచ్చిన నసీరుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్
ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. బాధితురాలు, ఆమె స్నేహితుడితోపాటు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఇక్కడ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనంతరం నిందితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. నేరం జరిగిన రోజు నిందితులు వేసుకున్న దుస్తులు, వాడిన మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామని, ఈ పరీక్షా ఫలితాలు తమ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతాయని పోలీసులు తెలిపారు.