దూపతీరేదెట్ల..?..కరీంనగర్ ఎల్ఎండీ నుంచి వరంగల్ కు వాటర్ సప్లై బంద్

దూపతీరేదెట్ల..?..కరీంనగర్ ఎల్ఎండీ నుంచి వరంగల్ కు వాటర్ సప్లై బంద్

 

  •     అండర్ రైల్వే జోన్ తో పాటు వర్ధన్నపేట, పర్వతగిరి తదితర మండలాలకు నిలిచిన నీటి సరఫరా
  •     ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా ఇవ్వలేని దుస్థితి
  •     ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టని ఆఫీసర్లు
  •     ఇంటెక్ వెల్ ఉన్నా పడావు పెట్టిన వైనం
  •     రోజుల తరబడి నీళ్లు రాక జనాలకు తప్పని ఇబ్బందులు

హనుమకొండ/ ధర్మసాగర్, వెలుగు: సముద్రాన్ని తలాపున పెట్టుకుని చేప దూపకేడ్చినట్టుంది వరంగల్ వాసుల పరిస్థితి. కరీంనగర్ ఎల్ఎండీ నుంచి ధర్మసాగర్ కు రా వాటర్ పంపింగ్ సమస్యలతో వరంగల్ అండర్ రైల్వే జోన్ తో పాటు చు ట్టుపక్కల మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఐదారు రోజులుగా ఆయా ప్రాంతాల ప్రజలు నీళ్ల కోసం అరిగోస పడుతున్నప్పటికీ ధర్మసాగర్ రిజర్వాయర్ లో పుష్కలంగా నీళ్లున్నా వినియోగించుకోలేని దుస్థితి దాపురించింది. ఇక్కడున్న ఇంటెక్ వెల్ ను పడావు పెట్టడం, ఎల్ఎండీ పైపులైన్ లో తరచూ సమస్యలు తలెత్తుతున్నా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని అందించేందుకు ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

'ఎల్ఎండీ'లో ప్రాబ్లం వస్తే నీళ్లు బంద్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 2.5 లక్షల ఇండ్లు, 12 లక్షల వరకు జనాభా ఉండగా, ప్రతిరోజు దాదాపు 173 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీళ్లు సప్లై చేయాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి ప్రతిరోజు తీసుకుంటున్న 105 ఎంఎల్డీ నీటిలో 60 ఎంఎల్డీ వరంగల్ అండర్ రైల్వే జోన్ ఏరియాకు, మిగతా 113 ఎంఎల్డీ నీటిని దేవాదుల ప్రాజెక్టులోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి తీసుకుంటున్నారు. 

ఆ నీటిని వడ్డేపల్లి, కేయూ, దేశాయిపేట, ధర్మసాగర్ లోని అండర్ రైల్వే జోన్ (60ఎంఎల్డీ) వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసి ఇండ్లకు సరఫరా చేస్తున్నారు. ఇక ఎల్ఎండీ నుంచి తీసుకుంటున్న దాంట్లో మిగిలిన నీటిని 20 ఎంఎల్డీ ధర్మసాగర్, వేలేరు, హసన్ పర్తి మండలాలకు, ఇంకో 25.5 ఎంఎల్డీని పర్వతగిరి, వర్ధన్నపేట, జాఫర్ గడ్ మండలాలకు సరఫరా చేస్తున్నారు. ఇదిలాఉంటే ఎల్ఎండీ పైపులైన్లతో తరచూ సమస్యలు వస్తున్నాయి. 

గతంలో ధర్మసాగర్ సమీపంలో గేట్ వాల్వ్ ప్రాబ్లం రాగా, దాదాపు వారం రోజులు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎల్ఎండీ పంపింగ్ మోటర్ల వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఐదారు రోజులుగా వాటర్ సప్లై నిలిచిపోయింది. దీంతో ఎల్ఎండీ నీటిపై ఆధారపడిన వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలోని దాదాపు 20 గ్రేటర్ విలీన గ్రామాలు, ధర్మసాగర్, వేలేరు, హసన్ పర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని దాదాపు 5 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తోంది.

ప్రత్యామ్నాయంపై దృష్టి పెడితేనే మేలు..

ఎల్ఎండీ పైపులైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తినా అండర్ రైల్వే జోన్ తో పాటు మిగతా మండలాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తరచూ ఇలాగే జరుగుతుండటంతో జనాలు తాగునీటితో పాటు కనీస అవసరాలకు నీళ్లు లేక అవస్థలు పడాల్సివస్తోంది. ఇప్పుడు ఐదారు రోజులుగా ఎల్ఎండీ వద్ద సమస్యలతో తాగునీటి సరఫరా నిలిచిపోగా, వరంగల్ కు చెందిన మిషన్ భగీరథ, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు అక్కడికి వెళ్లి రిపేర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. 

సకాలంలో రిపేర్లు కాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కానీ, ఎల్ఎండీకి ప్రత్యామ్నాయంగా ధర్మసాగర్ రిజర్వాయర్ నీటిని వాడుకునే దిశగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అండర్ రైల్వే జోన్ తో పాటు వివిధ మండలాల ప్రజలు కోరుతున్నారు.

ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా..

ఎల్ఎండీ వాటర్ సప్లై నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సంక్షోభం ఏర్పడగా, ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా వాటిని అండర్ రైల్వే జోన్ ఏరియాకు తరలించలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ధర్మసాగర్ రిజర్వాయర్ కెపాసిటీ 1.5 టీఎంసీ కాగా, వన్ టీఎంసీకి పైగానే నీళ్లున్నాయి. అయినా రిజర్వాయర్ కట్టను ఆనుకునే ఉన్న అండర్ రైల్వే జోన్ 60 ఎంఎల్డీతో పాటు 20 ఎంఎల్డీ, 25.5 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్లకు నీటిని తరలించే ఏర్పాట్లు మాత్రం లేవు. 

ఇదిలాఉంటే ఇక్కడున్న 25.5 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ కు లోయన్ మానేరు డ్యాం నుంచి నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్ ఇంటెక్ వెల్ నిర్మించి దాని ద్వారా ఫిల్టర్ బెడ్ కు నీటిని పంపింగ్ చేశారు. 2017లో 20 ఎంఎల్డీ, 60 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్లు నిర్మించాక ధర్మసాగర్ రిజర్వాయర్​లో ఉన్న ఇంటెక్ వెల్ మూసివేశారు. దీంతో ప్రత్యామ్నాయ సరఫరాకు అవకాశం లేకుండా పోయింది.