మళ్లీ అదే మాట.. మునీర్ నా ఫేవరేట్.. మోదీ వెరీ గుడ్ ఫ్రెండ్: డొనాల్డ్ ట్రంప్

 మళ్లీ అదే మాట.. మునీర్ నా ఫేవరేట్.. మోదీ వెరీ గుడ్ ఫ్రెండ్: డొనాల్డ్ ట్రంప్
  • ఈజిప్టులో గాజా పీస్ సమిట్​లో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్  
  •  పాక్, భారత్​పై ప్రశంసలు 
  •  రెండు దేశాలూ కలిసిమెలిసి ఉండాలంటూ సూచన   
  •  ఇటలీ పీఎం మెలోనీ అందంగా ఉన్నారంటూ కామెంట్ 
  •  ట్రంప్​ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్  

షర్మ్ ఎల్ షేక్(ఈజిప్టు): ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందంపై సోమవారం ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో జరిగిన గాజా పీస్ సమిట్ 2025 సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఒకే సమయంలో అటు పాకిస్తాన్​ను, ఇటు భారత్ ను ప్రశంసిస్తూ ఆయన మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ముందుగా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ తన ఫేవరేట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకొచ్చారు. 

ఆయన ఇక్కడ లేరని, పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఉన్నారని అన్నారు. వేదికపై షరీఫ్​కు ట్రంప్ ప్రాధాన్యం ఇచ్చారు. ట్రంప్ మాట్లాడుతుండగా షరీఫ్ ఆయన వెనకే నిలబడ్డారు. అయితే, అసీమ్ మునీర్​ను పొగిడిన కొన్ని క్షణాలకే ట్రంప్ భారత్​పై ప్రశంసలు కురిపించారు. భారత్ గొప్ప దేశమని, ఆ దేశానికి అధినేతగా తన మిత్రుడే ఉన్నారన్నారు. 

మోదీ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ‘‘ఇకపై పాకిస్తాన్, ఇండియా కలిసిమెలిసి ఉంటాయని భావిస్తున్నా. నిజమే కదా?” అంటూ వెనక్కి తిరిగి షరీఫ్​ను అడిగారు. దీంతో షరీఫ్ కాస్త ఇబ్బందిగా నవ్వుతూ ‘నిజమే’నని తలూపారు. అనంతరం షరీఫ్ ​మాట్లాడుతూ ట్రంప్​ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘ట్రంప్ శాంతి దూత. ఇండియా, పాక్ యుద్ధాన్ని ఆపారు. 

సౌత్ ఆసియాతోపాటు మిడిల్ ఈస్ట్ లోనూ లక్షలాది ప్రాణాలను కాపాడారు. ఆయనను మరోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తా” అని అన్నారు. వేదికపై తన వెనకే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపైనా ట్రంప్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ‘‘ఇక్కడో యంగ్ ఉమన్ ఉన్నారు. నేను ఈ విషయం చెప్తే నా పొలిటికల్ కెరీరే ముగిసిపోవచ్చు. 

కానీ ఇప్పుడు చెప్పక తప్పదు. ఆమె చాలా అందంగా ఉన్నారు” అంటూ ట్రంప్  కామెంట్ చేశారు. తర్వాత వెనక్కి తిరిగిన ఆయన ‘‘మీరు అందంగా ఉన్నారని అన్నందుకు ఏమీ అనుకోరు కదా? ఎందుకంటే మీరు అందంగా ఉన్నారు” అని అన్నారు. దీంతో మెలోనీ కాస్త ఇబ్బంది పడుతూ నవ్వుతూ ఉండిపోయారు. అయితే, ట్రంప్ ఇలా మెలోనీపై కామెంట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  

స్టార్ ఆఫ్ ది ఈవెంట్​గా మెలోనీ 

గాజా పీస్ సమిట్​లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్టార్ ఆఫ్ ది ఈవెంట్​గా నిలిచారు. సమిట్​లో 30 దేశాల అధినేతలు పాల్గొనగా.. వారిలో మెలోనీ ఒక్కరే మహిళా నేత. వేదికపై ట్రంప్​ను ఆమె ఇండియన్ స్టైల్​లో ‘నమస్తే’ అంటూ విష్ చేయడం విశేషం. ఆ తర్వాత ఆమె అందంపై ట్రంప్ కామెంట్లతోపాటు వేదికపై ఆమె హావభావాలు సైతం వైరల్ అయ్యాయి. 

అందంగా ఉన్నారంటూ ట్రంప్ పొడగడంతో ఇబ్బంది పడుతూ నవ్విన మెలోనీ.. ట్రంప్​ను పాక్ పీఎం షరీఫ్ పొగడ్తలతో ముంచెత్తుతుండగా విస్మయం చెందుతున్నట్టుగా నోటిని అరచేతితో మూసుకుని చూస్తూ ఉండిపోవడం ఆసక్తికరంగా మారింది. తర్వాత చేయి తీసివేసినా.. షరీఫ్​మాటలకు సర్​ప్రైజ్ అవుతున్నట్టుగా ఆమె ఎక్స్ ప్రెషన్లు కనిపించాయి. 

ఇక సమిట్​లో తుర్కియే ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్​తో మెలోనీ వీడియో కూడా వైరల్ అయింది. ‘‘మీరు ప్లేన్ దిగి వస్తుంటే చూశా. చాలా బాగున్నారు. కానీ మీరు స్మోకింగ్ మానెయ్యాలి” అని ఎర్దోగన్ అనగా.. పక్కనే ఉన్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రన్ స్పందిస్తూ.. ‘‘అది అసాధ్యం” అని కామెంట్ చేశారు. దీంతో మెలోనీ స్పందిస్తూ.. ‘‘నేను స్మోకింగ్ మానేస్తే.. ఎవర్నో ఒకర్ని చంపేయాల్సి వస్తుంది” అంటూ నవ్వులు పూయించారు.