లారీ కింద పడిన వృద్ధుడు.. కాపాడిన ట్రాఫిక్ పోలీస్

లారీ కింద పడిన వృద్ధుడు.. కాపాడిన ట్రాఫిక్ పోలీస్

సకాలంలో స్పందించి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిండు ప్రాణాన్ని కాపాడాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ సంఘటన జరిగింది. షాద్ నగర్ కు చెందిన శంకరయ్య అనే వృద్ధుడు తన టీవీఎస్ బండిపై వెళ్లుండగా.. చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడిందని బండి ఆపాడు. తర్వాత గ్రీన్ సిగ్నల్ పడడంతో ఆ వృద్ధుడు లారీ ముందు నుండి వెళ్తున్నాడు.. ఈ క్రమంలో లారీ తాకి  అతడు అదుపుతప్పి లారీ కింద పడిపోయాడు. అయితే అప్పటికే దీనిని గమనిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శీను వెంటనే అక్కడికి వేగంగా చేరుకొని లారీని నిలిపివేశాడు. 

స్థానికుల సహాయంతో అప్రమత్తమై వెంటనే కింద పడిన శంకరయ్యను పక్కకు లాగేశాడు కానిస్టేబుల్. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నాడు. వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ కానిస్టేబుల్ సరైన సమయానికి స్పందించకపోయి ఉంటే ప్రమాదం సంభవించి శంకరయ్య ప్రాణాలు కోల్పోయేవాడని స్థానికులు చెబుతున్నారు. కానిస్టేబుల్ సమయస్పూర్తికి జనాలు అభినందించారు. విషయం తెలుసుకున్న పై అధికారులు కానిస్టేబుల్ శీనును ప్రశంసించారు.