కారుతో ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవర్

కారుతో ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవర్
  • హర్యానాలో ఘటన.. వైరల్​గా మారిన వీడియో

చండీగఢ్: మద్యం మత్తులో ఓ డ్రైవర్‌‌‌‌ తన కారుతో ట్రాఫిక్ పోలీసునే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన హ‌‌ర్యానాలోని ఫరీదాబాద్‌‌లో ఉన్న బల్లభ్‌‌గఢ్ బస్టాప్ ఏరియాలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం బల్లభ్‌‌గఢ్ బస్టాప్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి రోడ్డు మధ్యలో తన కారును ఆపాడు. దాంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ట్రాఫిక్‌‌ పెరగటంతో పక్కనే తనిఖీల్లో ఉన్న ట్రాఫిక్ సబ్-ఇన్‌‌స్పెక్టర్ కారు డ్రైవర్ వద్దకు వెళ్లాడు. కారు డాక్యుమెంట్స్ చూపించమని కోరాడు. డ్రైవర్ స్పందించకపోవడంతో  పేపర్‌‌లను పరిశీలించేందుకు సబ్‌‌ఇన్‌‌స్పెక్టరే డ్రైవర్‌‌ డోర్‌‌ గుండా కారు లోపలికి వంగాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సబ్‌‌ఇన్‌‌స్పెక్టర్ కారు డోర్‌‌ గుండా లోపలికి చూస్తూ ఉండగానే డ్రైవర్ కోపంతో ఒక్కసారిగా యాక్సిలరేటర్‌‌ను నొక్కాడు.

దాంతో ట్రాఫిక్ పోలీస్ ను కారు అలాగే ముందుకు కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అక్కడున్న వారు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది వెంటనే వెహికల్​ను చుట్టుముట్టి అధికారిని కాపాడారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.