హెల్మెట్ వస్తువు కాదు .. ప్రాణాన్ని కాపాడే ఆయుధం : డీసీపీ సుబ్బరాయుడు

హెల్మెట్ వస్తువు కాదు .. ప్రాణాన్ని కాపాడే ఆయుధం : డీసీపీ సుబ్బరాయుడు

సికింద్రాబాద్​, వెలుగు: హెల్మెట్ వస్తువు కాదని.. ప్రాణాన్ని కాపాడే ఆయుధమని ట్రాఫిక్ డీసీపీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. సెల్ ఫోన్ పగలకుండా స్క్రీన్ గార్డ్, పౌచ్ లు వేయిస్తాం.. కానీ బైక్ నడిపేటప్పుడు తలా పగలకుండా హెల్మెట్ ధరించమని, సెల్ ఫోన్ కు ఉన్న విలువ కూడా  తలకు ఇవ్వడం లేదన్నారు.  “ మేమంతా హెల్మెట్ ధరిస్తున్నాం.. మీరు కూడా ధరించండి.. సురక్షితంగా మీ ఇండ్లకు  చేరుకోండి”అంటూ ఆయన వాహనదారులకు సూచించారు.

సికింద్రాబాద్​పీజీ కాలేజీలో  గురువారం పోలీసులు, కుటుంబ సభ్యులకు ఉచిత హెల్మెట్​పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.  యూత్ ఎక్కువగా ఓవర్ స్పీడ్ , రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, దీంతోనే   రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు.  వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ  మస్ట్ గా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.

మోటారు వాహనాల చట్టం కింద రైడర్ , పెలియన్ రైడర్ నే కాకుండా వెనక కూర్చున్న వ్యక్తి,  చిన్నపిల్లలు అయినా కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టంచేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే జీవిత బీమా క్లెయిమ్ కాదన్నారు. 2023 నాటికి సిటీలో దాదాపు 56.9 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, అందులో 18 లక్షల మందికి పైగా హెల్మెట్ ధరించలేదని తెలిపారు.

హెల్మెట్ లేని ప్రయాణం నేరమని,  ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,200  ఫైన్  విధిస్తామని, మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ అవుతుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శంకర్​రాజు, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్​ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 200 మంది పోలీసులు,  వారి పిల్లలకు 400 హెల్మెట్లు ఉచితంగా అందజేశారు.