
సైబరాబాద్కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు వాహనాలతో నిండిపోతున్నాయి. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను తిరిగి తీసుకువెళ్లేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో రోజుకు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు వాహనాలు వస్తుండడంతో స్థలం లేక వాటిని రోడ్డుపైనే పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా వాహనాలకు భద్రత కరువైంది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, మాదాపూర్, బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ పట్టుబడ్డ వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు ఏదో ఒక చోట తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, లైసెన్స్ లేకుండా నడుపుతూ పట్టుబడ్డ వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించి వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంటారు.
తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్…
డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ట్రాఫిక్ పోలీసులు అక్కడే చలాన్లు విధించి వాహనాలను స్వాధీనం చేసుకొని సంబంధింత పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. మరుసటి రోజు పట్టుబడిన వాహనదారులకు తమ తల్లిదండ్రులతో, లేక భార్య, భర్తతో కలిసి మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సిందిగా పేర్కొంటారు. కౌన్సిలింగ్‌కు హాజరైన వారికి ట్రాఫిక్ ఎస్ఐ సమక్షంలో ట్రాఫిక్ నియమాలపై, ప్రమాదాలపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కోర్టుకు హాజరై కోర్టు విధించిన ఫైన్ కట్టి, శిక్షను అనుభవించిన తర్వాతే ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాలను అప్పగిస్తారు.
కౌన్సిలింగ్‌కు వస్తలేరు.. వాహనాలను తీసుకు పోతలేరు..
పోలీసుల కౌన్సిలింగ్‌కు చాలా మంది వాహనదారులు హాజరు కావడం లేదు. దీనికి కారణం ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడం ఇంట్లో తెలిస్తే ఏం అవుతుందోననే భయం, కౌన్సిలింగ్‌కు హాజరై కోర్టులో జైలు శిక్ష పడితే తమ పరువు పోతుందనే భయం, కోర్టులో జైలు శిక్ష విధిస్తారనే భయం వాహనదారుల్లో నెలకొంది. అందుకే చాలా మంది తన వాహనాలను తీసుకువెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. దీని వలన ప్రతి రోజు పదుల సంఖ్యలో వాహనాలు పోలీస్ స్టేషన్‌కు వస్తుండడంతో వాహనాలను నిలిపేందుకు స్థలం సరిపోవడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
స్పందన అంతంతే...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో కోర్టు అధికారుల సమక్షంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దీనికీ స్పందన మాత్రం అంతంతే ఉంది. గత నెల 27న నిర్వహించిన లోక్ అదాలత్‌లో 29 కేసులను పరిష్కరించారు. దీనిలో జైలు శిక్ష విధించకుండా అన్ని ట్రాఫిక్ పీఎస్‌ల నుండి రూ.10,52,500 ఫైన్లు వసూలు చేసి వాహనాలను అప్పగించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌కు రూ.2000, సెల్ ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1000, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన వారికి రూ.500 చొప్పున ఫైన్లు వసూలు చేశారు. దీనికి కూడా వాహనదారుల నుండి స్పందన రావడం లేదని తెలుస్తోంది.