హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సిటీలో మరో భారీ మల్టీలెవల్ ఫ్లై‎ఓవర్.. తీరనున్న ట్రాఫిక్ సమస్య

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సిటీలో మరో భారీ మల్టీలెవల్ ఫ్లై‎ఓవర్.. తీరనున్న ట్రాఫిక్ సమస్య
  • రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల వద్ద తీరనున్న ట్రాఫిక్ సమస్య
  • రూ.398 కోట్లతో నిర్మాణం 
  • టెండర్లు ఆహ్వానించిన బల్దియా  
  • బంజారాహిల్స్​రోడ్ నంబర్​12 నుంచి మరో ఫ్లై ఓవర్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల మీదుగా ప్రయాణించేవారికి ట్రాఫిక్ సమస్య తీరనున్నది. నిత్యం లక్షలాది మంది ఈ రూట్​లో ముంబై, కర్నాటకలోని పలు ప్రాంతాలతో పాటు వికారాబాద్, చేవేళ్ల, శంకర్ పల్లి, గచ్చిబౌలి వైపు వెళ్తుంటారు. ఈ దారిలో నానల్ నగర్ తో పాటు పలు చోట్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంటోంది.

 ఈ సమస్యను దూరం చేసేందుకు రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్లలో హెచ్ సిటీ కింద సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బల్దియా ప్లాన్ ​చేస్తోంది. సరోజినీ దేవి కంటి దవాఖాన ముందు నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న పీవీఎన్​ఆర్ ఎక్స్ ప్రెస్ వేకు సమాంతరంగా మల్టీలెవల్ ​ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్లను నిర్మించేందుకు రూ. 398  కోట్లతో పనులు చేపట్టనున్నది. సెప్టెంబర్ 1 నుంచి 22 వరకు బిడ్లను స్వీకరించనున్నారు. 8న ప్రీ బిడ్ మీటింగ్​ఉంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ శుక్రవారం నుంచి టెండర్లను కూడా ఆహ్వానించింది. 

రెండు లైన్ల ఫ్లైఓవర్​..

మెహిదీపట్నం బసంతర్ హౌజ్​లోని ఆర్మీ స్థలంలో ఉన్న జలమండలి ఫిల్టర్ బెడ్ నుంచి పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వేకు సమాంతరంగా ఈ ఫ్లై ఓవర్ ను నిర్మిస్తూ రేతిబౌలి జంక్షన్ లో అత్తాపూర్ వైపు ఓ ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. 

రేతిబౌలి సిగ్నల్ నుంచి నానల్ నగర్ జంక్షన్ మీదుగా టోలీచౌకి ఫ్లై ఓవర్ కు కనెక్టివిటీగా కట్టనున్నారు. నానల్ నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్​సైడ్​లంగర్ హౌజ్ వైపు వెళ్లే వాహనాల కోసం నానల్ నగర్ జంక్షన్ కు ఎడమ వైపు ఉన్న ఆలివ్ హాస్పిటల్ వరకు ఓ ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం జీహెచ్ఎంసీ టెండర్లను కూడా ఆహ్వానించింది. ఈ ఫ్లై ఓవర్​పై నుంచి టోలీచౌకి, అత్తాపూర్, లంగర్ హౌజ్ వైపు వెళ్లే వాహనాలు మళ్లీ తిరిగి వచ్చే విధంగా రెండు లైన్లతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మెహిదీపట్నంలోని రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని ఈ ఫ్లై ఓవర్ కోసం సేకరించేందుకు జీహెచ్ఎంసీ సంప్రదింపులు జరుపుతోంది.  

రోడ్ నెం12 నుంచి మరొకటి..

బంజారాహిల్స్ నుంచి మెహిదీపట్నం, శంషాబాద్ ఎయిర్​పోర్ట్​, ముంబై నేషనల్​హైవే, లంగర్ హౌజ్ వైపు వెళ్లే వాహనాలు ప్రస్తుతం రోడ్ నంబర్​12లోని విరించి హాస్పిటల్ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ జంక్షన్,  ఎన్ఎండీసీ జంక్షన్, సరోజినీదేవి కంటి దవాఖాన, మెహిదీపట్నం రైతుబజార్, రేతిబౌలి, నానల్ నగర్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఎయిర్​పోర్ట్​వైపు వెళ్లే వాహనాలు సరోజినీ దేవి కంటి దవాఖాన ముందు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే  మీదుగా ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటున్నాయి. 

ఈ రూట్​లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీనికి చెక్ పెట్టేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి అహ్మద్ నగర్ డివిజన్ లోని హోటల్ నషేమన్, పోచమ్మ బస్తీ మీదుగా హుమాయున్ నగర్ మెయిన్ రోడ్డు, తర్వాత ఫిల్టర్ బెడ్ నుంచి నిర్మించనున్న ఫ్లై ఓవర్ కు అనుసంధానంగా మరో ఫ్లై ఓవర నిర్మాణానికి కూడా జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం స్థల సేకరణ దశలో ఉన్నట్లు తెలిసింది.