బంజారాహిల్స్‌లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

బంజారాహిల్స్‌లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రోడ్డు నంబర్ 12, బంజారాహిల్స్‌లో నిర్మించారు. దానిని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలోనే 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని జాయింట్ పోలీస్ కమిషనర్ కోరారు. రోడ్డు నంబర్ 12లో వాహనాలను ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటలకు వరకు అనుమతించరు. ఎన్‌టిఆర్ భవన్ నుంచి అపోల్ ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్ వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రోడ్డు నంబర్ 36, రోడ్డు నంబర్ 45 మీదుగా మాదాపూర్, సైబరాబాద్‌కు వెళ్లాలి. మాసబ్ ట్యాంక్ నుంచి రోడ్డు నంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు వయా మెహిదీపట్నం, నానాల్ నగర్, టోలీచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లాలి.