మెదక్, బోధన్, నిజామాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు షురూ

మెదక్, బోధన్, నిజామాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు షురూ
  • వరదకు కొట్టుకుపోయినహైవే రోడ్డు పునరుద్ధరణ
  • మెదక్, బోధన్,​ నిజామాబాద్ జిల్లాల మధ్య ప్రారంభం 

మెదక్, వెలుగు: వారం తర్వాత మెదక్ - బోధన్​ - నిజామాబాద్ రూట్​లో రాకపోకలు షురూ అయ్యాయి. భారీ వర్షాలతో మెదక్ -– కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోగా.. 80 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహించింది. దీంతో గత నెల 27న ప్రాజెక్ట్​ దిగువ నుంచి వెళ్లే నేషనల్​హైవే –765 డీ  రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. నేషనల్​హైవే విస్తరణలో  భాగం గా కొత్తగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం, పాత హైవే  కొట్టుకుపోవడంతో రెండు జిల్లాలకు బంధం తెగిపో యింది. 

రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడం తో నిజామాబాద్​, బోధన్​, బాన్సువాడ ఆర్టీసీ డిపోల నుంచి మెదక్ మీదుగా హైదరాబాద్ కు నడిచే ఆర్టీసీ బస్సులు, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మధ్య వెళ్లే గూడ్స్​వెహికల్స్, ఫ్యాక్టరీలకు ముడి సరుకు, ఉత్పత్తులు తీసుకెళ్లే  పెద్ద కంటెయినర్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వివిధ పనులపై అటు వైపు నుంచి ప్రయాణించేవారికి కామారెడ్డి, నిజామాబాద్​జిల్లాలకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. 

చుట్టూ తిరిగి కామారెడ్డి, రామాయంపేట మీదుగా అదనంగా 50 -– 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించి వెళ్లారు. మూడు జిల్లాల  మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో హైవే రోడ్డు పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేశారు. పదుల సంఖ్యలో టిప్పర్లతో 1,200 ట్రిప్పుల మొరం, మట్టి తెచ్చి పోశారు. పనులు పూర్తి చేయడానికి వారం రోజులు పట్టింది. దీంతో గురువారం నుంచి వాహనాలు రాకపోకలను ప్రారంభించారు. శుక్రవారం నుంచి ఆర్టీసీ బస్సులు కూడా రాకపోకలు సాగించే చాన్స్ ఉంది.