మొగిలయ్య కూతురి మృతి

మొగిలయ్య కూతురి మృతి

లింగాల, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు జారిపడి ఆయన కూతురు బుద్దుల రాములమ్మ(38) మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలయ్య రెండో కూతురు రాములమ్మ వివాహం 20 ఏళ్ల క్రితం నాగర్ కర్నూల్ మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో జరిపించారు. వివాహం జరిగిన నాలుగేళ్ల తర్వాత భర్త మృతిచెందాడు. అప్పటి నుంచి రాములమ్మ తండ్రి దగ్గరే ఉంటోంది. మంగళవారం గ్రామంలో వృద్ధురాలు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు ఆటోలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అచ్చంపేట దవాఖానకు రెఫర్ చేశారు. రాత్రి పది గంటల ప్రాంతంలో అచ్చంపేట దవాఖానకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బుధవారం మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫోన్​లో మొగిలయ్యను పరామర్శించారు. రాములమ్మ కూతురు వెన్నెల మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్​లో 8వ తరగతి చదువుతోంది. మొగిలయ్యకు మొత్తం తొమ్మిది మంది సంతానం కాగా వారిలో ఇప్పటికే వివిధ కారణాలతో నలుగురు చనిపోయారు. ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య మరణించింది.