
నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్లలో పండుగ పూట విషాద ఘటన జరిగింది. దిండి వాగులో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. డిండి వాగులో పడి అభి అనే బాలుడు గల్లంతయ్యాడు. ఆ పిల్లాడిని కాపాడబోయి మరో ఇద్దరు యువకులు కూడా వాగులో కొట్టుకుపోయారు. ఈ ముగ్గురూ గుంటూరు జిల్లా తెనాలి నుంచి పండగకు బంధువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన రాజు (28), భరత్ కుమార్ (27) మృతదేహాలు లభ్యమయ్యాయి. బాలుడు అభి(9)మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో కూడా దసరా పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ స్టేజీ సమీపంలో ఎన్ హెచ్ 44 వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో ఇరుక్కొని వెనుక ఉన్న లారీ డ్రైవర్ మృతి చెందాడు. క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి.
లారీ క్యాబిన్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ మృత దేహాన్ని అతి కష్టం మీద హైవే పోలీసులు బయటకు తీశారు. గాయపడ్డ క్లీనర్ను చికిత్స నిమిత్తం పోలీసులు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ మేరకు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.