
రుద్రప్రయాగ్: కేదార్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు భక్తులు చనిపోగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం గౌరీకుండ్– కేదార్ నాథ్ ట్రెక్కింగ్ మార్గంలోని చిర్బాసా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ మెనేజ్ మెంట్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి.
సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల నుంచి డెడ్ బాడీలను వెలికి తీశాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కాగా, ప్రాణాలు కోల్పోయిన వారిని మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన కిషోర్ అరుణ్ పరాటే (31), మహారాష్ట్ర జల్నా జిల్లాకు చెందిన సునీల్ మహాదేవ్ కాలే (24), రుద్ర ప్రయాగ్కు చెందిన అనురాగ్ బిస్త్గా అధికారులు గుర్తించారు.