వినాయకుల నిమజ్జనంలో విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి

వినాయకుల నిమజ్జనంలో విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి

వినాయకుల నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన మూడు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు, ఓ ఇంటర్ ​స్టూడెంట్​ చనిపోయారు. హుస్సేన్ సాగర్ లో జరిగే గణనాథుల నిమజ్జనాన్ని చూసేందుకు వెళ్తున్న ఓ బాలుడు.. తల్లిదండ్రుల కళ్ల ముందే లారీ కింద పడి చనిపోయాడు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన రాజశేఖర్.. హైదరాబాద్ సంతోష్ నగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. గురువారం రాత్రి తన భార్య సాయిప్రియ, కొడుకు ఆయాన్ష్ (4) తో కలిసి ట్యాంక్ బండ్ కు బైక్ పై బయలుదేరాడు. 9:30 గంటల ప్రాంతంలో బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ దాటి ట్యాంక్ బండ్ వైపు వెళ్తుండగా.. లిబర్టీ సిగ్నల్ వద్ద వర్షం పడి అతని బైక్ స్కిడ్ అయింది. దీంతో బైక్​పై తల్లిదండ్రుల మధ్యలో కూర్చున్న ఆయాన్ష్.. రోడ్డుపై కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు. వారి వెనుక నుంచి నిమజ్జనానికి వస్తున్న లారీ (టస్కర్) బాలుడి పై నుంచి వెళ్లింది. దీంతో బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిమజ్జనం అనంతరం ఇంటికి వెళ్తుండగా ప్రమాదం 

గణపతి నిమజ్జనం అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ ఇంటర్ ​స్టూడెంట్​కదులుతున్న లారీ ఎక్కబోయి లారీ కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన రాంగోపాల్​పేట పోలీసుస్టేషన్​ పరిధిలోని ట్యాంక్​బండ్​ సంజీవయ్య పార్కు ఏరియాలో జరిగింది. బహదూర్​పురాకు చెందిన ప్రణీత్​(17) అదే ప్రాంతంలోని ఓ  కాలేజీలో  ఇంటర్​ చదువుతున్నాడు. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి గణపతుల నిమజ్జనం చూసేందుకు నెక్లెస్​ రోడ్డుకు వెళ్లాడు. నిమజ్జనం తరువాత తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారు వచ్చిన లారీని ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా లారీ కదలడంతో  కిందపడిపోయాడు. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలై ఇక్కడికక్కడే మృతి చెందాడు. 

ప్రమాదవశాత్తు ..ట్రాక్టర్​ట్రాలీ కింద పడి..

వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ట్రాలీ కింద పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్‌‌‌‌గూడలోని ప్రైమరీ స్కూల్​ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుడి శోభాయాత్రను గురువారం రాత్రి ప్రారంభించారు. ఊరేగింపు పూర్తై పోచారం చెక్​డ్యాంలో నిమజ్జనానికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో కర్ణంగూడ దగ్గర్లో శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ట్రాక్టర్​ కు ప్రత్యేకంగా వినాయకుడి కోసం అమర్చిన ట్రాలీపై కూర్చొని ఉన్న అంకిళ్ల రవీందర్, జ్యోతి దంపతుల చిన్నకుమారుడు సెహనాథ్​(14) ప్రమాదవశాత్తు జారి ట్రాలీ కిందపోయాడు. దీంతో అతని తలకు తీవ్రగాయమైంది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే తుదిశ్వాస విడిచాడు.