హైదరాబాద్‌ మియాపూర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ మియాపూర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్ సిటీలోని మియాపూర్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. చనిపోయిన వారిలో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం శోచనీయం. మియాపూర్ పరిధిలోని మక్త మహబూబ్ పేటలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.

మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్​విషయంలో మొదలైన గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. భర్తతో గొడవ పెట్టుకున్న భార్య.. ఇద్దరు కొడుకులను సంపులో పడేసి.. తాను కూడా అదే సంపులో దూకింది. అయితే, చిన్నారులు మృతి చెందగా.. తల్లి ప్రాణాలతో బయటపడింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం విలేజ్​కు చెందిన లక్ష్మణ్, రత్న దంపతులకు జనార్దన్(8), పవన్(7), అరుణ్​(3), సుభాష్(8 నెలలు) నలుగురు మగ సంతానం.

బతుకుదెరువు కోసం వచ్చి నిజాంపేట్​హనుమాన్​ టెంపుల్ ఏరియాలో​నివాసముంటున్నారు. అందులో ఇద్దరు పిల్లలు జనార్దన్, పవన్​వారి నానమ్మ వద్ద ధర్మారం విలేజీలో ఉంటున్నారు. లక్ష్మణ్, రత్న తమ చిన్న కొడుకులు అరుణ్, సుభాష్ తో కలిసి బాచుపల్లిలో ఓ రేకుల గదిలో ఉంటున్నారు. లక్ష్మణ్​ ఇటుక లారీలపై కూలీగా పనిచేస్తుంటాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్​విషయంలో గొడవ జరుగుతోంది. తనకు మరో సంతానంగా ఆడపిల్ల కావాలని లక్ష్మణ్​ పట్టుపడుతున్నాడు. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారని.. తనకు ఫ్యామిలీ ప్లానింగ్​ చేయించాలని భార్య రత్న కోరుతోంది.

ఇందుకు భర్త అంగీకరించలేదు. మంగళవారం సైతం అదే విషయమై గొడవ జరిగింది. రాత్రి లక్ష్మణ్​ పనికి వెళ్లగా రత్న తన ఇద్దరు పిల్లలు అరుణ్, సుభాష్ ను ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసి ఆమె కూడా దూకింది. శబ్దం రావడంతో పక్కనుండే ఓ వ్యక్తి గమనించి సంపులో ఉన్న రత్నను పైకి లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పిల్లలను బయటకు తీయగా అప్పటికే వారు మృతి చెందారు. రత్నను ట్రీట్​మెంట్​కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.