
నిర్మల్, వెలుగు : అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీకూతురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిర్మల్ పట్టణంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బంగల్‌పేటకు చెందిన సుంకరి లక్ష్మీబాయి (75) భర్త చనిపోగా, ఆమె కూతురు రుక్మాబాయి (55) భర్తతో విడిపోయి తల్లివద్దే ఉంటోంది. లక్ష్మీబాయికి గతంలో ఓ కాలు తీసేయగా... రుక్మాబాయి సైతం అనారోగ్యంతో బాధపడుతోంది.
దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ శుక్రవారం ఉదయం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి నీటిలో దూకారు. స్థానికులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే నీటిలో మునిగి చనిపోయారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.