ఉమ్రా యాత్రకు వెళ్లి అక్కడ జరిగిన బస్సు ప్రమాదంలో నగరానికి చెందిన 45 మంది కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ముషీరాబాద్ నియోజకవర్గం విద్యానగర్ ప్రాంతం నుంచి ఒకే కుటుంబంలోని 18 మంది ఉండడం కలచివేసింది.
అలాగే కార్వాన్, నాంపల్లి, పాతబస్తీ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబంలో నలుగురు, ఐదుగురు కన్నుమూయడంతో వివరాలు చెప్పడానికి దూరపు బంధువులు తప్ప దగ్గరి వారు ఎవరూ లేకుండా పోయారు. మృతుల గురించి తెలుసుకున్న మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఇతర కాంగ్రెస్ లీడర్లు, ఎంఐఎం ఎమ్మెల్యేలు బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా తమ వారిని తల్చుకుని కన్నీరు పెట్టుకున్నవారిని ఓదార్చారు. అలాగే నగరం నుంచి రెండు ట్రావెల్ఏజెన్సీల నుంచే చనిపోయిన 45 మంది ఉమ్రా యాత్రకు వెళ్లగా.. తమ వారి వివరాల కోసం ఉదయం పలువురు ట్రావెల్ఆఫీసులకు తరలివచ్చి వివరాలు అడగడం కనిపించింది. ఈ ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
– హైదరాబాద్ సిటీ, వెలుగు
