ప్రాణం తీసిన పది వేలు.. అప్పు విషయంలో గొడవ పడిన అన్నదమ్ములు

ప్రాణం తీసిన పది వేలు.. అప్పు విషయంలో  గొడవ పడిన అన్నదమ్ములు
  • అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు
  • అడ్డుకునేందుకు వెళ్లిన వదినకు కత్తిపోట్లు.. మృతి

నల్లబెల్లి , వెలుగు : రూ. 10 వేల అప్పు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరుగగా.. ఆగ్రహానికి గురైన తమ్ముడు అన్నపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన వదిన కత్తిపోట్లకు గురై చనిపోయింది. ఈ ఘటన వరంగల్‌‌ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. కొండాపురం గ్రామానికి చెందిన మేరుగుర్తి రమేశ్‌‌, సురేశ్‌‌ అన్నదమ్ములు. సురేశ్‌‌ నాలుగు నెలల కింద రూ. 10 వేలను అన్నకు అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలని సురేశ్‌‌ తన అన్న రమేశ్‌‌ను అడుగుతుండడంతో అతడు రేపుమాపు అంటూ తిప్పుతున్నాడు. 

ఈ క్రమంలో బుధవారం ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సురేశ్‌‌ కత్తితో అన్నపై దాడి చేశాడు. గమనించిన రమేశ్‌‌ భార్య స్వరూప (40) అడ్డుకునేందుకు వెళ్లగా.. ఆమె కత్తిపోట్లకు గురైంది. గమనించిన స్థానికులు స్వరూపను 108లో నర్సంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. గాయపడిన రమేశ్‌‌ను వరంగల్‌‌ ఎంజీఎంకు తరలించారు. సురేశ్‌‌ బుధవారం రాత్రే పోలీసుల ఎదుట లొంగిపోయాడు.