కోహెడ లో ప్రేమించి.. కొడుకును కని.. వేరొకరితో పెండ్లి..మనస్తాపంతో ప్రియుడి సూసైడ్!

 కోహెడ లో ప్రేమించి.. కొడుకును కని.. వేరొకరితో పెండ్లి..మనస్తాపంతో ప్రియుడి సూసైడ్!
  •     రంగారెడ్డి జిల్లా కోహెడలో ఘటన  
  •     ఆత్మహత్యకు ముందు యువకుడి సెల్ఫీ వీడియో

ఎల్బీనగర్, వెలుగు: ప్రేమించిన అమ్మాయి.. తనతో బిడ్డను కని.. ఆ బిడ్డను వేరెవరికో ఇచ్చి.. ఇంకో పెండ్లి చేసుకుందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ మండలం కోహెడకు చెందిన పల్లపు గోవర్ధన్(28) క్యాబ్ డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. శారీరకంగా కూడా దగ్గరవడంతో గత ఏడాది మార్చిలో యువతి గర్భం దాల్చింది. పెద్దలను ఒప్పించి ఎట్లాగు పెండ్లి చేసుకుంటామని భావించిన యువతి గర్భాన్ని మోసింది. 

ఏడు నెలల తర్వాత మగ బిడ్డ పుట్టాడు. అయితే, కులాలు వేరవడంతో యువతి తల్లిదండ్రులు పెండ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఆమెకు పుట్టిన కొడుకును వేరెవరికో ఇచ్చి ఆమెకు మరో వ్యక్తితో పెండ్లి చేశారు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ ​ఆ యువతిని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం నైట్ డ్యూటీ చేసుకొని వచ్చి.. రూమ్ లో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడం, డోర్ కొట్టిన తీయకపోవడంతో గోవర్ధన్ చెల్లెలు పక్కింటి వారి సాయంతో డోర్ పగలగొట్టించింది. దీంతో లోపల గోవర్ధన్​ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. స్థానిక డాక్టర్ ను పిలిపించి చూపించగా అప్పటికే గోవర్ధన్​చనిపోయినట్టు నిర్ధారించారు. 

సూసైడ్​కు ముందు సెల్ఫీ వీడియో

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన చావుకు తాను ప్రేమించిన యువతే కారణమని గోవర్ధన్​కారులో కూర్చొని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుందాం అనుకున్నం.. తనతో కలిసి కొడుకును కూడా కన్న ఆమె.. నా కొడుకుని ఎవరికో అమ్మేసి వేరే పెండ్లి చేసుకుంది. ఆ అమ్మాయి కారణంగానే నేను చనిపోతున్నా. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. మీరు నాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. కానీ, ఓ అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని అందులో పేర్కొన్నాడు. 

‘నన్నెందుకు మోసం చేశావ్.. ఇదేదో ముందే చెబితే నేనే దూరంగా ఉందును కదా. నాతో కొడుకుని కని.. నన్ను, నా కొడుకును ఆగం చేసినవ్. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో వదులొద్దు’ అని గోవర్ధన్​రోదించాడు. గోవర్ధన్ తల్లి ఫిర్యాదుతో ఆ యువతిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.