
- ఉరేసుకొని ఆత్మహత్య
- తట్టుకోలేక రెండు చేతుల మణికట్లు కోసుకున్న అమ్మాయి
- లివ్ఇన్ రిలేషన్‌షిప్‌లో మనస్పర్ధలే కారణం.. అస్సాంలో దారుణం
గువాహటి: ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ ను రూంలో లాక్ చేసి, ఉరివేసుకోగా, అది చూసి ఆమె రెండు చేతుల మణికట్లు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అస్సాం రాజధాని గువాహటిలో ఈ దారుణం జరిగింది. నవజ్యోతి తాలుక్‌దార్ అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ సుష్మితా దాస్‌తో ఏడాది కాలంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఇటీవల వారి మధ్య గొడవలు పెరిగాయి.
బుధవారం అర్ధరాత్రి నవజ్యోతి తాలుక్‌దార్, సుష్మితా దాస్‌ను ఒక గదిలో బంధించి, మరో గదిలో ఉరివేసుకున్నాడు. ఇది చూసి సుష్మితా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అయితే వారు వచ్చేసరికి ఆమె తన మణికట్లు కోసుకున్నది.
పోలీసులు వచ్చి రక్తపుమడుగులో ఉన్న సుష్మితను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. సుష్మిత ఒక మీడియా చానెల్‌లో పనిచేస్తున్నదని, ఈ జంట మధ్య తరచూ గొడవలు జరిగేవని తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు చెప్పారు.