గురుకుల స్కూల్‌‌‌లో టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌ సూసైడ్‌‌‌‌.. హనుమకొండ జిల్లా వంగర బాలికల గురుకులంలో ఘటన

గురుకుల స్కూల్‌‌‌లో టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌ సూసైడ్‌‌‌‌.. హనుమకొండ జిల్లా వంగర బాలికల గురుకులంలో ఘటన
  • హనుమకొండ జిల్లా వంగర బాలికల గురుకులంలో ఘటన
  • ప్రిన్సిపల్, సిబ్బంది వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు
  • డెడ్‌‌‌‌బాడీతో ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి
  • సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

హనుమకొండ/భీమదేవరపల్లి/హుజురాబాద్, వెలుగు: గురుకుల స్కూల్‌లో ఉంటున్న టెన్త్‌‌‌‌ క్లాస్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వంగర పీవీ రంగారావు బాలికల గురుకుల స్కూల్‌‌‌‌లో శుక్రవారం జరిగింది. కరీంనగర్ జిల్లా రాంపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన వనం మమత- తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత (14) వంగరలోని పీవీ రంగారావు గురుకుల స్కూల్‌‌‌‌లో టెన్త్‌‌‌‌ చదువుతోంది. ఈ నెల 15న కడుపు నొప్పితో బాధపడడంతో కుటుంబసభ్యులు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. దీపావళి సెలవులు ముగిసిన తర్వాత గురువారం మధ్యాహ్నం తిరిగి హాస్టల్‌‌‌‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ప్రార్థన ముగిసిన తర్వాత శ్రీవర్షిత డార్మెటరీ హాల్‌‌‌‌కు వెళ్లింది. టీచర్లు అటెండెన్స్‌‌‌‌ తీసుకుంటున్న సమయంలో శ్రీవర్షిత కనిపించకపోవడంతో తోటి స్టూడెంట్స్‌‌‌‌ను డార్మెటరీకి పంపించారు. 

వారు అక్కడికి వెళ్లి చూడగా డార్మెటరీ డోర్ లోపలి వైపు గడియ పెట్టి ఉండడంతో విషయాన్ని టీచర్లకు తెలియజేశారు. వారు వచ్చి బలవంతంగా తలుపు తెరిచి చూసేసరికి శ్రీ వర్షిత ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది. వెంటనే వంగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, డెడ్‌‌‌‌బాడీ బాడీని హుజూరాబాద్‌‌‌‌ ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కాగా, చదువులో చురుగ్గా ఉంటూ క్లాస్‌‌‌‌టాపర్‌‌‌‌గానూ, స్కూల్‌‌‌‌ లీడర్‌‌‌‌గానూ వ్యవహరిస్తున్న శ్రీవర్షిత ఇటీవల కలెక్టర్‌‌‌‌ చేతుల మీదుగా ప్రైజ్‌‌‌‌ సైతం అందుకుంది. స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌కు గల కారణాలపై ఎంక్వైరీ చేస్తున్నామని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్‌‌‌‌రెడ్డి చెప్పారు. శ్రీవర్షిత సూసైడ్‌‌‌‌ చేసుకోవడంతో తోటి స్టూడెంట్లు కన్నీరుమున్నీరయ్యారు. గురుకులాల రాష్ట్ర కార్యదర్శి నికోలస్‌‌‌‌ ఆదేశాల మేరకు గురుకులానికి మూడు రోజులు సెలవు ప్రకటించారు. 

భయంగా ఉందంటూ తండ్రికి ఫోన్‌‌‌‌
దీపావళి సెలవుల తర్వాత గురువారం మధ్యాహ్నం హాస్టల్‌‌‌‌కు వచ్చిన శ్రీవర్షిత.. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్‌‌‌‌ సిబ్బంది సెల్‌‌‌‌ నుంచి తన తండ్రికి ఫోన్‌‌‌‌ చేసింది. ‘నాకు భయంగా ఉంది, సంవత్సరంకాలం నుంచి ప్రిన్సిపల్, సిబ్బంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా చెప్పలేకపోయాను’ అని తనతో చెప్పిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హాస్టల్‌‌‌‌కు వస్తున్నానని చెప్పి రాంపూర్‌‌‌‌ నుంచి వంగరకు చేరుకునేలోపే ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. భయంగా ఉందన్న తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శ్రీవర్షిత తల్లిదండ్రులు మమత, తిరుపతి డిమాండ్ చేశారు. 

డెడ్‌‌‌‌బాడీతో ఆందోళన
శ్రీవర్షిత చనిపోయిన విషయం తెలుసుకున్న హుజూరాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి హుజురాబాద్‌‌‌‌ ఏరియా హాస్పిటల్‌‌‌‌కు చేరుకున్నారు. పోస్ట్‌‌‌‌మార్టం పూర్తయిన తర్వాత స్టూడెంట్‌‌‌‌ కుటుంబసభ్యులతో కలిసి స్థానిక అంబేద్కర్‌‌‌‌ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. హాస్టల్‌‌‌‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శ్రీవర్షిత చనిపోయిందని మండిపడ్డారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్‌‌‌‌తో ఫోన్‌‌‌‌లో మాట్లాడి, స్టూడెంట్‌‌‌‌ మరణంపై విచారణ జరపాలని, ప్రిన్సిపల్‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌ చేయాలని ఖోరారు. మృతురాలి ఫ్యామిలీకి రూ.కోటి ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. తగిన విచారణ జరిపిస్తామని కలెక్టర్‌‌‌‌ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అంతకుముందు స్కూల్‌‌‌‌ వద్ద కాంగ్రెస్, సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. 

విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం
గురుకులంలో టెస్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్యపై పదో తరగతి విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ విచారం వ్యక్తం చేశారు. హనుమకొండ కలెక్టర్‌‌‌‌ స్నేహ శబరీశ్‌‌‌‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో హనుమకొండ డీఈవో వాసంతి స్కూల్‌‌‌‌కు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పూర్తి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.