
అనంతపురం: చిన్నారులను ఒక వయసు వచ్చేదాకా మనం ఏ పనిలో ఉన్నా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆదమరిస్తే.. క్షణం చాలు పిల్లలు తెలిసీతెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇలాంటి విషాద ఘటనే జరిగింది. వేడి వేడి పాలల్లో పడి 16 నెలల పాప చనిపోయింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గత శనివారం ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం (సెప్టెంబర్ 25, 2025) ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి పాలు కాగబెట్టిన పాత్రలో పడిన సమయంలో అక్కడ పెద్ద వాళ్లు ఎవరూ లేకపోవడంతో ఈ ఘోరం జరిగిపోయింది.
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి దురదృష్టవశాత్తూ పాల పాత్రలో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిన్నారి అక్షిత తల్లి ఆ పాఠశాలలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల కోసం వేడి చేసిన పాలలో చిన్నారి పడిపోయిన ఘటన, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్ల గుండెలు బాధతో బరువెక్కడం ఖాయం.
ఆ వీడియోను పరిశీలిస్తే.. విద్యార్థుల కోసం ఆ చిన్నారి తల్లి పాలు వేడి చేసి కాలేజ్ మెస్లోని ఫ్యాన్ కింద కాస్తంత చల్లారడానికి పెట్టింది. సెప్టెంబర్ 20న ఉదయం 6 గంటల సమయంలో ఆ పాలను గమనిస్తూనే ఆ పాత్ర పెట్టిన దగ్గరలో ఉన్న వంట గదిలోకి వెళ్లింది. తల్లిని వెతుక్కుంటూ చిన్నారి అక్షిత కూడా వచ్చింది. ఆ చిన్నారితో పాటు ఒక పిల్లి కూడా ఉంది. ఆ పాలు కాగబెట్టిన పాత్ర దగ్గరలోకి అక్షిత వచ్చేసరికి ఆ పిల్లి వేరే వైపుకు వెళ్లిపోయింది.
ఆ పిల్లిని తన దగ్గరకు పిలిచే క్రమంలో అక్షిత చూసుకోకుండా వెనకనే ఉన్న పాలు కాగబెట్టిన పాత్రలో పడిపోయింది. పాలు బాగా వేడిగా ఉండటంతో చిన్నారి శరీరం కాలిపోయింది. ఆ చిన్నారి బయటకు వచ్చే ప్రయత్నంలో ఉండగా ఏడుపు వినిపించి అక్షిత తల్లి పరుగుపరుగున వచ్చి పాపను బయటకు తీసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. దురదృష్టవశాత్తూ చిన్నారి అక్షిత వారం నుంచి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది.
పొరపాటున వేడి పాలలో పడిన చిన్నారి మృతి.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఘటన#Anantapur #TragedyAlert #ShockingNews pic.twitter.com/gmREbtUT1U
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) September 26, 2025