పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి గ్రామంలో అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ తీగ తగిలి శనివారం రాత్రి తల్లి కళ్ల ముందే కొడుకు చనిపోయాడు. రంగంపల్లి గ్రామంలో బాలు (30) తన తల్లి పార్వతమ్మ, సోదరుడుతో కలిసి శెనగ తోటలోకి వెళ్లాడు. అక్కడ పని పూర్తయ్యాక శనివారం సాయంత్రం చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరారు.
అందరి కంటే ముందు నడుస్తున్న బాలు కాలికి అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ తీగ తగిలింది. దీంతో షాక్కొట్టి స్పాట్ లోనే మృతి చెందాడు. గమనించిన అతడి సోదరుడు తల్లి పార్వతమ్మను వెనక్కి లాగడంతో ఆమెకు ముప్పు తప్పింది. గ్రామస్తులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి కరెంట్ ఆఫ్ చేశారు. కళ్లేదుటే కొడుకు చనిపోతున్నా కాపాడలేకపోయానంటూ తల్లి పార్వతమ్మ ఏడ్వడం పలువురిని కంటతడి పెట్టించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీని పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.