
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ ఉద్దీన్ (23) బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం అతడిని హిమాయత్ సాగర్ ప్రాంతంలో రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ యాక్సిడెంట్లో అతని కాలికి తీవ్ర గాయమైంది. డాక్టర్లు వైద్యం చేసి కట్టు కట్టారు. కాలికి గాయం కావడంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆరిఫ్ ఉద్దీన్ మంగళవారం తెల్లవారుజామున ర్యాపిడో వాహనం బుక్ చేసుకొని ఓటీపీ ఇంటి దగ్గరే చెప్పేసి ఫోన్ ఇంట్లో పెట్టేశాడు.
హిమాయత్ సాగర్ సౌడమ్మ గుట్ట ప్రాంతానికి వచ్చాడు. కాలికి గాయం కావడంతో వాకింగ్ స్టాండ్ తీసుకెళ్లాడు. హిమాయత్ సాగర్ చెరువు ఫెన్సింగ్ పైకి ఎక్కి అందులో దూకాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు NDRF సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరిఫ్ మృతదేహం కోసం ముమ్మరం గాలిస్తున్నారు. అయితే ఈ యువకుడి ఆత్మహత్యకు ప్రస్తుతానికి కారణాలు తెలియలేదు. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్లి మరీ చెరువులో దూకి ప్రాణాలు తీసుకోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.