ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రైళ్లు.. త‌ప్పిన ఘోర ప్ర‌మాదం

ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రైళ్లు.. త‌ప్పిన ఘోర ప్ర‌మాదం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ -జైరాంనగర్‌ రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఒకేలైన్లో రెండురైళ్లు వచ్చాయి. ఈ సమయంలో  లోకోపైలట్ల అప్రమత్తతతో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. జైరామ్‌నగర్‌ -కొట్మిసొనర్‌ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులతో పాటు స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఏం జరిగిందంటే..

కోర్బా వెళ్తున్న మెమూ రైలుకు ఎదురుగా అదే పట్టాలపై గూడ్సు రైలు వచ్చింది.  రెండు రైళ్ల డ్రైవర్లూ క్షణాల్లో తేరుకుని బ్రేకులు వేశారు. కొన్ని మీటర్ల దూరంలో ఎదురెదురుగా ఆగాయి.  ఈ ఘటనకు  మానవ, సాంకేతిక తప్పిదాలు కారణమని భావిస్తున్నారు.  ఈ ఘటనతో రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపాలున్నాయని మరోసారి బయటపడింది.   ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

రైల్వే శాఖ క్లారిటీ..

ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై  రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇది  ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని చెప్పింది.  రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టంచేసింది. బిలాస్‌పుర్‌- జైరాంనగర్‌ మధ్య ఆటోమేటిక్‌ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని.., రైల్వే నిబంధనల ప్రకారం.. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని పేర్కొంది. ఒకే ట్రాక్‌లో వచ్చిన రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని.., సమీపంలోకి వచ్చిన తర్వాత రెండు రైళ్లకు రెడ్‌ సిగ్నల్‌ పడి.. కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది.

సిగ్నలింగ్‌ బ్లాక్‌ కావడం వల్లనే..

మరోవైపు ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ బ్లాక్‌ కావడం వల్ల ఈ ఘటన జరిగిందని ఆగ్నేయ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే నియమాల ప్రకారం ఎక్కడైనా ఇలాంటి బ్లాక్‌ ఏర్పడితే అదే లైన్‌లో ఒకటి, అంతకంటే ఎక్కువ రైళ్లను ఒకే సమయంలో సిగ్నల్స్‌ ఆధారంగా నడిపిస్తారు. ఈ ప్యాసింజర్‌ రైలు విషయంలో కూడా ఇలాగే జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు.