చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి వెళ్తున్న వారంతపు ప్రత్యేక రైలుకు గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు చక్రాల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే లోకో పైలట్ కు సమాచారం ఇవ్వడంతో వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గొల్లగూడ స్టేషన్సమీపంలో రైలును నిలిపివేశారు.
రైల్వే సిబ్బంది, సాంకేతిక నిపుణులు మంటలను అదుపు చేశారు. బ్రేక్ బైండింగ్(చక్రాలకు బ్రేక్లు పట్టేయడం) కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో సుమారు అరగంటపాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తనిఖీల అనంతరం అధికారులు రైలును తిరిగి పంపించారు.
