- టీజీటీ నోటిఫికేషన్ రిలీజ్
- 4,006 పోస్టుల్లో 3,011 పోస్టులు మహిళలకే
- ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు.. వచ్చే నెల 27దాకా చాన్స్
హైదరాబాద్, వెలుగు: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. గురుకుల పోస్టుల్లో ఇప్పటి వరకు పాటిస్తున్న ట్రెండ్‌నే బోర్డు అనుసరించింది. మహిళలకే సింహభాగం కోటాను కేటాయించింది. 4,006 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. అందులో 3,011 పోస్టులను మహిళలకే రిజర్వ్ చేసింది. 75 శాతం పోస్టులకు మహిళలకు కేటాయించింది. 995 పోస్టులను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేయనుంది. ఆయా పోస్టులకు శుక్రవారం నుంచి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వచ్చే నెల 27 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. అయితే ఏప్రిల్ 5న ప్రకటించిన దాని ప్రకారం 4,020 పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా.. 14 పోస్టులకు బోర్డు కోత పెట్టడం గమనార్హం.
మూడు పేపర్లుగా ఎగ్జామ్
ఎగ్జామ్‌ను 3 పేపర్లుగా బోర్డు నిర్వహించనుంది. పేపర్–1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లీష్)ను తెలుగు, ఇంగ్లీష్లలో నిర్వహించనుండగా.. పేపర్–2 (పెడగాజీ ఆఫ్ సబ్జెక్ట్), పేపర్–3 (సబ్జెక్ట్ నాలెడ్జ్)లను మాత్రం ఇంగ్లీష్‌లోనే నిర్వహించనున్నట్టు పేర్కొంది. నోటిఫికేషన్లోనే సిలబస్‌ను వెల్లడించింది. ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్షను నిర్వహించనున్నట్టు పేర్కొన్న బోర్డు.. అవసరమైతే పరీక్షల పద్ధతిని ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్చే అధికారం తమకుందని తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు మాత్రమే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. ఎగ్జామ్ ఫీజునూ భారీగానే ఫిక్స్ చేసింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ.600గా ఫీజును నిర్ణయించింది. మరిన్ని వివరాలకు www.treirb.telangana.gov.inలో చూడొచ్చని తెలిపింది.
గురుకుల సొసైటీ పోస్టులు
- సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ 728
- గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ 218
- మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ 2,379
- మైనారిటీస్ గురుకుల విద్యాసంస్థల సొసైటీ 594
- తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 87
- మొత్తం 4,006