
ఒట్టావా: రెండు శిక్షణ విమానాలు గాలిలోనే ఢీకొని ఇద్దరు యువ పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్, ల్యాండింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గురువారం కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరు కేరళలోని కొచ్చికి చెందిన శ్రీహరి సుఖేష్ కాగా, మరొకరు కెనడాకు చెందిన సవన్నా అనే యువకుడని అధికారులు తెలిపారు.
ఈ మేరకు కెనడాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు సుఖేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం ట్రైనింగ్‌లో భాగంగా సుఖేష్.. మినీ ప్లేన్‌లో టేకాఫ్‌కాగా మరో ట్రైనీ విమానం వచ్చి ఢీకొట్టిందని ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. రెండు ఫ్లైట్లలో రేడియో వ్యవస్థ ఉన్నప్పటికీ వారు ఒకరికొకరు అత్యంత దగ్గరికి వచ్చినట్లు గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాగా, సుఖేష్ మృతివార్తతో కేరళలోని అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సుఖేష్ ఇప్పటికే ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ కలిగి ఉండగా, కమర్షియల్ పైలెట్‌గా మారేందుకు కెనడాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.