వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలకు ట్రెయినింగ్

వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలకు ట్రెయినింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వార్డు మెంబర్లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీళ్లకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పలు రంగాల్లో ఎక్స్ పర్ట్ లను జిల్లా కలెక్టర్లు ఎంపిక చేశారు. వీరికి రాజేంద్ర నగర్ లోని టీఎస్ ఐఆర్డీ (తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్)లో శిక్షణ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు టీవోటీల( ట్రైనర్స్ ఆఫ్ ట్రైనింగ్ )కు గతంలోనే ట్రైనింగ్ పూర్తి చేయగా, తాజాగా వార్డు మెంబర్లకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ కు కూడా శిక్షణ పూర్తయింది. దీంతో త్వరలోనే జిల్లా, మండల కేంద్రాల్లో వార్డ్ మెంబర్లకు ట్రెయినింగ్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పంచాయతీ రాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్లు చర్చించి ట్రైనింగ్ షెడ్యూలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎనిమిది నెలలుగా వాయిదా

రాష్ట్రవ్యాప్తంగా 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వీళ్లు ఈ ఏడాది ఏప్రిల్ లో విధుల్లో చేరారు. అయితే అప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఏ పని చేయాలన్నా, వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు.  ఏడాదికి రెన్యూవల్ చేసే విధంగా ప్రభుత్వం వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. వీరి పనితీరును పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రతి నెల గ్రేడింగ్ లు ఇస్తూ లెక్కిస్తున్నారు. దీంతో ట్రైనింగ్ ఇవ్వకపోవటంతో 8 నెలలుగా వీరంతా భయంతో విధులను నిర్వర్తిస్తున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ, వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో జిల్లాల్లో, మండల కేంద్రాల్లో బ్యాచ్ లుగా విడదీసి వీరికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రెయినింగ్ లో వీటి మీదనే ఫోకస్

పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పంచాయతీ రాజ్ చట్టం–2018ని తీసుకొచ్చింది. ఈ చట్టంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ ల అమలు, ఉపాధి హామీ, గ్రామ సభలు, రికార్డుల నిర్వహణ, పన్నుల వసూలు, హరిత హారం, పారిశుధ్యం నివారణ, నిధుల ఖర్చు, మహిళా సంఘాలు పనితీరు, అభివృద్ధి ప్రణాళిక వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం, గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించటం, పంచాయతీ అభివృద్ధిలో సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులే కీలక పాత్ర పోషించనున్నందున సమగ్రంగా అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చి, వారి సందేహాలను తీర్చనున్నారు.

200 మంది రెడీగున్నరు

వార్డ్ మెంబర్లకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా1.13 లక్షల వార్డు మెంబర్లు ఉన్నారు. ఇంత మందికి
ఒకే దగ్గర శిక్షణ ఇవ్వటం సాధ్యం కాదు. అందుకే వీరికి శిక్షణ ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి 200 మంది టీవోటీ ( ట్రైనర్స్ ఆఫ్ ట్రైనింగ్) లకు ట్రైనింగ్ ఇచ్చాం. కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలు, గ్రామ పంచాయతీలో రికార్డుల నిర్వహణ, ఆదాయ వ్యయాలు, గ్రామ సభ, అభివృద్ధి ప్రణాళిక వంటి అంశాలలో ట్రైనింగ్ ఇచ్చాం. త్వరలో వీళ్లు జిల్లా, మండల కేంద్రాల్లో వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులకు ట్రెయినింగ్ ఇస్తారు. ఇందులో పంచాయతీ రాజ్ చట్టం 2018పై అవగాహన కల్పిస్తారు.                               – నరేంద్రనాథ్ రావు, జాయింట్ డైరెక్టర్, టీఎస్ ఐపార్డ్