-
జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్.. మరిన్ని డయాగ్నస్టిక్ హబ్స్
-
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రోడ్ మ్యాప్
-
దశలవారీగా నాలుగేండ్లలో అమలు.. సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా
-
ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ఆరోగ్య శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి అధికారులు రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. ఆరోగ్య రంగంలో వచ్చిన టెక్నాలజీ, మారుతున్న పరిస్థితులు, రోగాలు, చికిత్సలకు అనుగుణంగా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. దశలవారీగా రానున్న నాలుగేండ్లలో ఏమేం చేయాలన్న పూర్తి వివరాలను నివేదికలో పొందుపర్చారు. ఇందుకోసం సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.
ప్రభుత్వ దవాఖాన్లలో మౌలిక సదుపాయల కల్పన మొదలుకుని.. అత్యాధునిక పరికరాల కొనుగోలు వరకు అనేక అంశాలను ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. జీవనశైలి వ్యాధులను అరికట్టడం, రోగులకు చికిత్స ఇవ్వడంపై సర్కార్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తున్నది. డయాలసిస్, వస్క్యులర్, డ్రగ్ డీ అడిక్షన్, కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ల ఏర్పాటును ప్రతిపాదనల్లో అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ల ఏర్పాటు, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు.
డయాగ్నస్టిక్స్ సేవలను విస్తరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కొత్తగా 60 డయాగ్నస్టిక్ హబ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లలో ఎంఆర్‌ఐ మిషిన్లను కూడా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్స్..
రోడ్ యాక్సిడెంట్, ఇతర ఎమర్జెన్సీ సందర్భాల్లో బాధితుల ప్రాణాలు పోకుండా పకడ్బందీ ట్రామాకేర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా 109 ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. వీటి కోసం సుమారు రూ.921 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ట్రామాకేర్ సెంటర్ ఉండడంతో పాటు ఎమర్జెన్సీలో రూ.లక్ష వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించనున్నారు. మరోవైపు కార్పొరేట్ హాస్పిటళ్లలో అవయవ మార్పిడి చికిత్సల దందాకు చెక్ పెట్టాలని సర్కార్ భావిస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. జిల్లాల్లోని టీచింగ్ హాస్పిటళ్లలో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, టిమ్స్‌ల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
ఫుడ్, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్..
రాష్ట్రంలో ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాల బానిసల సంఖ్య లక్షల్లో ఉంది. ప్రస్తుతం ఒక్క ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ మినహా.. రాష్ట్రంలో మరెక్కడా డీ అడిక్షన్ సెంటర్లు లేవు. ఈ నేపథ్యంలో జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్ ఉండాలని ప్రభుత్వ భావిస్తున్నది. దాదాపు రూ.350 కోట్లతో సుమారు వెయ్యి బెడ్ల కెపాసిటీతో 35 డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
వీటితో పాటు కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లు, 35 వస్క్యులర్ సెంటర్లు, 10 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, 10 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్, అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో వుమెన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ఇలా మొత్తం ప్రజారోగ్య వ్యవస్థ స్వరూపాన్ని మార్చి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భావిస్తున్నారు. దశలవారీగా వీటికోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్‌హెచ్‌ఎం కింద నిధులు కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
