
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వం గెజిటెడ్ హెచ్ఎంల ట్రాన్స్ఫర్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం మల్టీ జోనల్ స్థాయి గెజిటెడ్ హెచ్ఎంలు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మల్టీ జోనల్ స్థాయిలో ప్రమోషన్లు చేపట్టడం వల్ల దూర ప్రాంతాల్లోని స్కూళ్లలో పనిచేస్తున్నామని, దీంతో కుటుంబాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు దూర ప్రాంతాల్లో తమకు పోస్టింగులు ఇచ్చారని వాపోయారు. బదిలీలు చేపట్టి హెడ్మాస్టర్లను సొంత జిల్లాలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు దామోదర్ రెడ్డి, అచ్యుత్ రెడ్డి, కృష్ణాచారి, పీవీఎల్ఎస్ మూర్తి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రసన్న పాల్గొన్నారు.