సూర్యాపేట: ఒక్క రోజే 183 మంది VROల బదిలీ

సూర్యాపేట: ఒక్క రోజే 183 మంది VROల బదిలీ
  • ఎంపీడీవోకు షోకాజ్‌‌‌‌.. కార్యదర్శుల సస్పెన్షన్‌‌‌‌

హరితహారం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ ఎంపీడీవోకు షోకాజ్‌‌‌‌ నోటీస్‌‌‌‌ ఇవ్వడంతో పాటు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్‌‌‌‌ సస్పెండ్‌‌‌‌ చేశారు. శనివారం అన్ని మండలాల ఆఫీసర్లతో కలెక్టర్‌‌‌‌ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించి హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మఠంపల్లి ఎంపీడీవోకు షోకాజ్‌‌‌‌ నోటీసు జారీ చేశారు.టీఏ, ఎఫ్‌‌‌‌ఏలను మరో మండలానికి మార్చడంతో పాటు, లాల్‌‌‌‌తండా, కామాక్షి తండా కార్యదర్శులను సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నిన్నమొన్నటి వరకు సస్పెన్షన్లు.. తాజాగా ట్రాన్స్‌‌‌‌ఫర్లతో సూర్యాపేట కలెక్టర్‌‌‌‌ అమయ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఒకేసారి183 మంది వీఆర్వోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని రెవెన్యూ ఆఫీసర్లపై అవినీతి ఆరోపణలు పెరగడం, చాలా మంది ఏళ్ల తరబడి ఒకే మండలంలో పనిచేస్తుండడంతో వారిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

ఫేస్‌‌‌‌ టు ఫేస్‌‌‌‌లో వెలుగులోకి..

భూ రికార్డుల ప్రక్షాళనలో అవకతవకలు జరిగాయని, వాటిని సరిచేయాలని రెవెన్యూ ఆఫీసర్ల వద్దకు వెళ్తే వారు పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలామంది రైతులు గ్రీవెన్స్‌‌‌‌ డేలో తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌‌‌‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతివారం గ్రీవెన్స్‌‌‌‌డేకు రైతులే ఎక్కువ మంది రావడంతో  భూ సమస్యలను పరిష్కరించేందుకు ఫేస్‌‌‌‌ టు ఫేస్‌‌‌‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల అన్ని మండలాల్లో కలెక్టర్‌‌‌‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమయంలో రైతులు వీఆర్వోలపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. భూ రికార్డుల్లో తప్పులను సరిచేయాలని కోరితే పట్టించుకోవడం లేదని, ప్రతి పనికి రేటు కడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్‌‌‌‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వోలను సస్పెండ్‌‌‌‌ చేశారు. మరికొందరు వీఆర్వోలు మద్యం తాగి డ్యూటీకి హాజరవుతున్నారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు వారికి డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ టెస్టులు నిర్వహించాలని తహసీల్దార్‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు.

224 మందికి 183 మంది బదిలీ

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 224 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. శనివారం ఒక్కరోజే 183 మందిని బదిలీ చేస్తూ కలెక్టర్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన వీఆర్వోలలో చాలా మంది గతంలోనే సస్పెండ్‌‌‌‌ అయ్యారు. బదిలీలు అయిన వారు వెంటనే రిలీవ్‌‌‌‌ అయి బదిలీ అయిన చోట రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.

పరిపాలన సౌలభ్యం కోసమే.. 

జిల్లాలో రెండేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వీఆర్‌‌‌‌వోలను పరిపాలనా సౌలభ్యం కోసం సాధారణ బదిలీలు చేశాం. అదే విధంగా రెవెన్యూ శాఖలో పారదర్శకంగా పనులు చేసేలా ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు.

– అమయ్‌‌‌‌కుమార్‌‌‌‌, కలెక్టర్‌‌‌‌