అఘోరి రిమాండ్​లో హైడ్రామా .. 14 రోజుల రిమాండ్​తో కంది జైలుకు..

అఘోరి రిమాండ్​లో హైడ్రామా .. 14 రోజుల రిమాండ్​తో కంది జైలుకు..
  • పురుషుడు అంటూ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు 
  • అమ్మాయిలా ఉందని అభ్యంతరం  చెప్పిన జైలు అధికారులు 
  • మళ్లీ చేవెళ్ల దవాఖానలో పరీక్షలు 
  • ట్రాన్స్​జెండర్​గా తేల్చడంతో చంచల్​గూడ జైలుకు తరలింపు 

చేవెళ్ల, వెలుగు: ఓ మహిళను చీట్​చేసిన కేసులో మహిళా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరికి చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. యూపీలో ఉన్న అఘోరిని పట్టుకువచ్చిన మోకిలా పోలీసులు విచారణ తర్వాత దవాఖానలో వైద్య పరీక్షలు చేయించి, కోర్టులో హాజరుపరిచారు. మోకిలా సీఐ వీరబాబు కథనం ప్రకారం.. శ్రీనివాస్ అలియాస్ అఘోరి దూత (23), శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ లో ఉంటున్న ఓ మహిళా సినీ నిర్మాతతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారు. తనకు తాను ఆధ్యాత్మిక రక్షకుడిగా చెప్పుకున్నారు. ఆమెను ప్రభావితం చేసి ఆమె కుటుంబాన్ని దుష్టశక్తుల నుంచి రక్షించేందుకు తాంత్రికపూజలు చేయాల్సిన అవసరం ఉందని నమ్మబలికారు. 

దీని కోసం మొదట రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. తర్వాత బెదిరించి మరో రూ.4.30 లక్షలు తీసుకున్నారు. మరొకసారి కత్తులు, తుపాకీ చూపించి మరో రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తాంత్రిక శక్తులతో చంపేస్తానని హెచ్చరించారు. భయపడిన బాధితురాలు మోకిలా పోలీసులను ఆశ్రయించడంతో మోసం, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక స్పెషల్​టీమ్​ను ఏర్పాటు చేయగా, వారు నిందితురాలిని మంగళవారం ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి.. బుధవారం విచారణ కోసం తీసుకొచ్చారు.   

5 గంటల విచారణ 

మోకిలా పోలీసులు బుధవారం అఘోరిని నేరుగా నార్సింగి ఏసీపీ ఆఫీసుకు తీసుకువచ్చారు. అక్కడ దాదాపు 5 గంటల పాటు విచారించిన పోలీసులు అఘోరి దగ్గర ఉన్న రూ.5,500 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు మెడికల్​టెస్టుల కోసం తరలించారు. ఆధార్​కార్డుపై శ్రీనివాస్​అని ఉండడంతో ఆ పేరుపైనే వైద్య పరీక్షలు నిర్వహించి మేల్​అని మెన్షన్​చేసి చేవెళ్ల కోర్టు జడ్జి ఎదుట హాజరు పరిచారు. పత్రాల ప్రకారం.. అఘోరి మేల్ అనుకున్నారు. ‘ఎవరైనా అడ్వొకేట్​ను పెట్టుకున్నారా’ అని జడ్జి  అడిగారు. అఘోరి తనకు అంత స్థోమత లేదని సమాధానమిచ్చారు. దీంతో లీగల్​ఎయిడ్​సర్వీసెస్​నుంచి అడ్వొకేట్​ను కేటాయించారు. తర్వాత అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించగా, పోలీసులు కంది జైలుకు తరలించారు.
 
ఏ బ్యారక్​లో ఉంచాలి?  

అఘోరీని పోలీసులు చేవెళ్ల నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంది జైలుకు తీసుకువెళ్లాక జైలు అధికారులు అభ్యంతరం చెప్పారు. అఘోరిని చూస్తే ఆడమనిషిలా కనిపిస్తోందని, ‘మగవాళ్ల బ్యారక్ లో ఉంచాలా? ఆడవాళ్ల బ్యారక్ లో ఉంచాలా?’ అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు తమ దగ్గరున్న మెడికల్ రిపోర్టులు చూపించగా అందులో సాధారణ లింగ నిర్ధారణ టెస్టుకు సంబంధించిన ఫలితం లేదు. ఆధార్​కార్డులో మేల్​అని ఉండగా, దాన్ని కన్సిడర్​చేయలేదు. తమది మగాళ్ల జైలు అని, తమ దగ్గర ఉంచుకోలేమని, డాక్టర్​సర్టిఫై చేస్తేనే తీసుకుంటామని చెప్పారు.

 దీంతో పోలీసులు చేసేది లేక మళ్లీ చేవెళ్ల దవాఖానకు తీసుకువెళ్లారు. సాయంత్రం 4.30కు అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో లింగ నిర్ధారణ టెస్టులు చేయించారు. గతంలో చెన్నై, ఇండోర్ లో లింగ మార్పిడి సర్జరీలు చేయించుకున్నానని చెప్పడంతో పరీక్షించారు. తర్వాత ‘ట్రాన్స్ జెండర్'గా సర్టిఫై చేస్తూ సర్టిఫికెట్​ఇచ్చారు. దీంతో మళ్లీ కోర్టుకు తీసుకెళ్లగా జడ్జి ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక బ్యారక్ లు ఉన్న చంచల్ గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది : అఘోరి 

చేవెళ్ల కోర్టుకు వచ్చిన అఘోరి అక్కడ మీడియాతో మాట్లాడారు. తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తున్నానని, చట్టం తనపని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు. అఘోరి వెంట ఉన్న వర్షిణి పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా, తనను పంపిస్తే జైలుకు కూడా తీసుకెళ్తానని చెప్పారు.  

2024లో పురుషుడే అని సర్టిఫికెట్​ 

ఇండోర్​ విజయనగర్ లో ఉన్న బండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్​లో శ్రీనివాస్ కు 2024 జులై 8న జండర్ అసెస్మెంట్​సర్జరీ చేశారు. కావాల్సినంత టిష్యూ కణజాలం లేకపోవడంతో వెజినా సర్జరీ చేయడానికి వీలు కాదని తేల్చి చెప్పారు. అప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ లో క్లియర్ గా పురుషుడు అని మెన్షన్​చేశారు. అతడు హిజ్రా కానీ, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చెందిన వాడు కాదని నిర్ధారించారు. ఇండోర్​నుంచి స్వగ్రామానికి వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నాడు. అందులో కూడా శ్రీనివాస్(అఘోరి మాత), స్త్రీ అని తీసుకున్నాడు.