అతడు.. ఆమెగా మారి.. డాక్టరై, పోలీసై!

అతడు.. ఆమెగా మారి.. డాక్టరై, పోలీసై!

చీరలు, చప్పట్లు, కరుకుగా ఉండే గొంతుకలు…. దారిన వెళ్తుంటే ఆపి డబ్బులిమ్మంటూ చికాకు పెట్టే సంఘటనలు. ట్రాన్స్ జెండర్ అనగానే 90% మందిలో ఇప్పటికీ అదే ఉద్దేశం. జెండర్ డిస్క్రిమినేషన్ విషయంలో ఆడవాళ్ల హక్కుల కోసం పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ట్రాన్స్‌‌జెండర్లకి కూడా హక్కులుంటాయని,
వాటికోసం పోరాటం చేయాలన్న ఆలోచన రావటానికే చాలా టైం పట్టింది. మానసికంగా, సొసైటీలో ఒక కనీస గుర్తింపు కోసం తపన పడ్డ ట్రాన్స్‌‌జెండర్స్ ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నారు.  పోలీస్, డాక్టర్ లాంటి ఉద్యోగాలే కాదు పాలిటిక్స్​లోకి కూడా ఎంటర్ అవుతున్నారు…

‘కాంచన’ సినిమా ఒక ట్రాన్స్ జెండర్ అమ్మాయిని డాక్టర్ చేయాలనే కాన్సెప్ట్‌‌తోనే తయారయ్యింది. ఇప్పుడు ఆ సినిమా కథ నిజం అయ్యింది. మగ శరీరంలో ఆడపిల్లగా ఉండలేక పూర్తిగా ఆడపిల్లలలాగా మారిపోతే ఇంట్లో, బయటా అలాంటి వాళ్లని ఎలా చూస్తారో మనకు తెలియంది కాదు. అడుక్కోవటం, అందరికీ దూరంగా తనలాంటి వాళ్లతో కలిసి బతకటం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కానీ ప్రియ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె కుటుంబం పూర్తిగా తన మనసుని అర్థం చేసుకుంది. ఆమె డాక్టర్ కావటానికి కావాల్సిన ఆత్మ విశ్వాసం ఇంటి నుంచే అందింది. “మా అమ్మానాన్న నాకు కావాల్సినంత ధైర్యం ఇచ్చారు. వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటాను” అని చెబుతోంది ట్రాన్స్‌‌జెండర్ డాక్టర్ ప్రియ.

చాలా అవమానాలు పడ్డాను

జిను శశిధరన్ అనే అబ్బాయిగా జన్మించిన ప్రియ తనలో ఉన్న అమ్మాయిల లక్షణాలని చిన్నప్పుడే గమనించింది. కానీ బయటికి చెప్పాలంటే సిగ్గు, భయం ఉండేవట.  “పదిహేనేళ్లు వచ్చేసరికి భరించలేకపోయాను. ప్రతీరోజు నాలో ఉండే ఆ డైలమానీ, అమ్మాయిలా ఉండాలనే కోరికలని నా డైరీలో రాసుకునే దాన్ని.  అబ్బాయిలాగా మారు వేషంలో తిరుగుతున్నట్టు ఉండేది. ఇంట్లో చెబితే ఎలా తీసుకుంటారోనని భయం ఉంది. కానీ ధైర్యం చేసి ఒకరోజు అమ్మానాన్నలకి విషయం చెప్పేశాను. నా తల్లిదండ్రులు చేసిన మొదటి పని నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోవటం. అయితే అది మానసిక సమస్య కాదని నేను అమ్మాయిగానే ఉండాలనుకోవటం నా శరీరంలోనే ఉందని ఆయన చెప్పారు.

స్కూల్‌‌లో ఉన్నంత వరకూ అసలు విషయం బయటికి తెలియనివ్వలేదు. కానీ ఆడపిల్లలా ఉండే నా ప్రవర్తనకి అబ్బాయిల నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత వేరే ప్రదేశానికి మారిపోవాలనుకున్నాను. కానీ, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్‌‌గా నిలబడింది.” అంటూ తన లైఫ్ జర్నీని చెప్పింది డాక్టర్ ప్రియ.

అమ్మానాన్నా ఇద్దరూ నర్సులే…

అమ్మా నాన్న.. నన్నూ అన్నయ్యనీ డాక్టర్లు గా చూడాలనుకున్నారు. అన్నయ్య ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరులో డాక్టర్‌‌‌‌గా పని చేస్తున్నాడు. నేను మెడికల్ కాలేజ్‌‌లోకి వెళ్లటానికి భయపడి టీచర్ అవ్వాలనుకున్నాను. కానీ నాన్న ధైర్యం చెప్పాక ఎంట్రన్స్ రాశాను.  2013 లో త్రిసూర్ దగ్గర ఒల్లూర్‌‌‌‌లోని “వైద్యరత్నం ఆయుర్వేద కాలేజ్”లో చేరాను. అవమానాలు ఉండకూడదు అంటే కచ్చితంగా మంచి చదువు, సక్సెస్ ఉండాలని అనుకునే దాన్ని అందుకే కష్టపడి చదివాను. అదే టైంలో నా సమస్య మీద కూడా స్టడీ చేయటం మొదలు పెట్టాను.

పెళ్లి గురించి అడుగుతుంటే

బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్​, మెడిసిన్ అండ్ సర్జన్​ పూర్తి చేశాను. అందరూ పెళ్లి గురించి అడుగుతుంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంగుళూర్ లో పీజీ  (ఎం.డీ) చేశాను. ఆ తర్వాత, త్రిపునితుర ప్రభుత్వ ఆయుర్వేదిక్​ మెడికల్ కాలేజ్, కన్నూర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌‌‌‌గా పని చేశాను. త్రిసూర్‌‌లోని సీతారాం ఆసుపత్రిలో చేరినప్పుడు హార్మోన్ ట్రీట్‌‌మెంట్ మొదలైంది. ఆ తర్వాత, నేను కొన్ని నెలల క్రితం నన్ను అమ్మాయిగా మార్చే ఆపరేషన్ చేయించుకున్నాను. ఈ మొత్తం ప్రాసెస్‌‌లో నా కుటుంబం ఇచ్చిన భరోసా చాలా గొప్పది.

చట్టాన్ని మార్పించి..

తమిళనాడు, సేలం జిల్లాలో ఉండే  ట్రాన్స్‌‌జెండర్‌‌ ప్రీతికా యాశిని కూడా పోలీస్ అవడం కోసం చాలా కష్టపడింది.  ప్రదీప్ కుమార్ అనే అబ్బాయిగానే కంప్యూటర్ అప్లికేషన్స్​లో మాస్టర్ డిగ్రీ చేసిన అతను జెండర్ మార్చుకుని ప్రీతికా యాశినిగా మారిపోయింది అయితే, ఆపరేషన్‌‌కి ముందు  పోలీస్‌‌ ఎస్సై పరీక్షలకు అప్లై చేసింది. ఇందులో తనను తాను మూడో కేటగిరీ (ట్రాన్స్‌‌జెండర్) కింద నమోదు చేసుకుంది. దానివల్ల తమిళనాడు హోంశాఖ ప్రీతిక అప్లికేషన్ ని రిజెక్ట్ చేసింది. థర్డ్ జెండర్ కేటగిరీలో ట్రాన్స్ జెండర్  కోటా లేకపోవడంతో ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది.  అయితే, ప్రీతిక ఏమాత్రం అధైర్యపడకుండా హైకోర్టును ఆశ్రయించింది. వీటిని పరిశీలించిన కోర్టు.. ప్రీతిక కేసుని స్పెషల్ కేస్‌‌గా తీసుకొని మరీ కట్‌‌ఆఫ్ మార్కులు 28.5 నుంచి 25కు తగ్గించింది. ఫిజికల్ ఫిట్‌‌నెస్‌‌లో మంచి మార్కులే ఉన్నాయి . అయితే, 100 మీటర్ల రన్నింగ్‌‌లో ఒకే ఒక్క సెకండ్‌‌తో వెనుకబడింది. అయినప్పటికీ.. కోర్టు ప్రీతికను ఎస్.ఐ ఉద్యోగానికి అర్హురాలిగా ప్రకటించింది.

రీసెర్చ్ చేసి తెలుసుకున్నా

జెండర్ చేంజ్ ఆపరేషన్, దాని ఖర్చులు ఆ తర్వాత వచ్చే సమస్యల విషయంలో చిన్న రీసెర్చ్ చేశాను. నా పేరెంట్స్ కి విషయం చెప్పినప్పుడు బాధపడ్దారు. నన్ను సైకియాట్రిస్ట్ ట్రీట్‌మెంట్‌తో అబ్బాయిలాగే ఉంచటానికి వీలుంటుందేమోనని ప్రయత్నించారు. వాళ్ల బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నేను తెలుసుకున్న సమాచారమంతా వాళ్లకి వివరించాను, అది సహజంగా వచ్చేదనీ, మానసిక జబ్బు కాదని అర్థమయ్యేలా చెప్పాను. అలా నాకు దొరికిన ఇన్ ఫర్మేషన్ మొత్తం వాళ్లకి ఇచ్చి ఒప్పించాను. ఇలా వాళ్ల అబ్బాయి ఒక అమ్మాయిగా మారిపోవటం అనేది పరువు పోయే విషయంగా కాకుండా. వాళ్ల బిడ్దగా నా సంతోషాన్నే కోరుకున్నారు.

మొట్టమొదటి ఎంబీబీఎస్

డాక్టర్ ప్రియలాగానే సొసైటీతో ఫైట్ చేస్తూ తమ గోల్స్ ని సాధించిన ట్రాన్స్ జెండర్స్ ఇంకొందరున్నారు.  లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమన్ గా మారిన త్రినేత్ర ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. కర్ణాటకకు చెందిన త్రినేత్ర అసలు పేరు అంగద్ గుమ్మరాజు. స్వస్థలం బెంగళూరు. అయితే తనలో స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయని భావించి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకుంది. అంగద్ అనే తన పాత పేరును తొలగించి, తల్లిపేరు కలిసొచ్చేలా ‘త్రినేత్ర’ అని మార్చుకుంది. బెంగళూరులో ఎంబీబీఎస్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో మొట్టమొదటి డాక్టర్ . త్రినేత్ర సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది. తన లైఫ్‌ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ కూడా చేసింది. సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌‌కు వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.