
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల 60 వేల కొత్త ఆటో పర్మిట్లు జారీ చేయడానికి జీవో జారీ చేసిందని, సదరు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆంక్షలు విధించడం దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్ వెంకటేశం అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడైనా కొత్త ఆటోలు కొనుగోలు చేయవచ్చని జీవోలో ఉంటే కమిషనర్ చెప్పిన ఫలానా డీలర్ వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేయడం ఏంటని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన డీఎల్ఎఫ్ ఆటో లైసెన్స్ఇప్పుడు చెల్లదని, త్రీవీలర్, ఫోర్‌వీలర్ లైసెన్స్కలిగిన వారందరూ ఆటో కొనుగోలుకు అర్హులని ప్రభుత్వ గైడ్ లైన్స్ లో ప్రకటించినా త్రీవీలర్ లైసెన్స్కలిగినవారే అర్హులని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అందరికీ ఆటో పర్మిట్లు ఇవ్వాలని, రాష్ట్రంలో ఎక్కడైనా ఆటోలు కొనుగోలు చేయడానికి అనుమతించాలని కోరారు. జేఏసీ నేతలు ఎంఏ.సలీం(యూటీఏడీడబ్ల్యూఏ), వి.ప్రవీణ్(టీయూసీఐ), ఎస్.రామకిషన్(బీఆర్టీయూ), పి. యాదగిరి(టీఎన్టీయూసీ), నాయకులు పాల్గొన్నారు.