ఆర్టీసీ ఉద్యోగులను తీసెయ్యం, సస్పెండ్ చేయం

ఆర్టీసీ ఉద్యోగులను తీసెయ్యం, సస్పెండ్ చేయం
  • కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నం
  • సమ్మెలో ఉద్యోగులను చూస్తే మస్తు బాధనిపించింది : మల్లారెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

ఆర్టీసీలో ఇక నుంచి ఉద్యోగులను సస్పెండ్‌‌‌‌ చేయడం, విధుల నుంచి తొలగించడం ఉండదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ చెప్పారు. శుక్రవారం మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌‌‌‌పేట బస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఆర్టీసీ ఉద్యోగులతో వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. జేబీఎస్‌‌‌‌ నుంచి శామీర్‌‌‌‌ పేట బస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ వరకు మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రయాణం చేశారు. అక్కడ ఉద్యోగులతో సహపంక్తి భోజనాలు చేశారు. ఆర్టీసీ మొబైల్‌‌‌‌ బయో టాయిలెట్లను ప్రారంభించారు. తర్వాత అజయ్‌ మాట్లాడారు. యాజమాన్యం, ఉద్యోగులనే తేడా లేకుండా ఉండేందుకు వన భోజనాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

త్వరలోనే సమ్మె కాలపు జీతం

ఆర్టీసీ అదనపు ఆదాయం పొందేందుకు కార్గో బస్సు లు సిద్ధమవుతున్నాయని, జనవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయని మంత్రి పువ్వాడ చెప్పారు. ప్రతినెలా సకాలంలో జీతాలు ఇచ్చేలా చూస్తామని, సీసీఎస్‌‌‌‌ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను త్వరలోనే ఒకేమొత్తంగా ఇస్తామన్నారు. కండక్టర్లకు మెరూన్‌‌‌‌ కలర్‌‌‌‌ యాప్రాన్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేసినట్టు చెప్పారు. ప్రతి డిపోను లాభాల్లోకి తేవాలని, డిపోలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ప్రజాప్రతినిధులకు లేఖలు రాశామని, వారు ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని చెప్పారు. సంస్థలో ఉద్యోగులంతా ఐకమత్యంతో ఉండాలని, కొందరు దీనిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు.

బాధకు మించి సంతోషం కలిగించినం: మల్లారెడ్డి

సమ్మె సమయంలో ఆర్టీసీ ఉద్యోగులను చూస్తే చాలా బాధ అనిపించిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఉద్యోగులు ఎంత బాధ పడ్డారో, కేసీఆర్‌‌‌‌ అంతకు రెట్టింపు సంతోషం కల్పిస్తున్నారన్నారు. ఉద్యోగులు ఏది కావాలనుకున్నా సీఎం, రవాణా మంత్రి కాదనరని చెప్పారు. ఆర్టీసీని లాభాల్లోకి తేవాలని, వచ్చే ఏడాది సంక్రాంతికి బోనస్‌‌‌‌ కూడా తీసుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు ఇద్దరు మంత్రులు, ఆర్టీసీ ఇన్‌‌‌‌చార్జి ఎండీ సునీల్​శర్మ, ఈడీలు పురుషోత్తం, వినోద్‌‌‌‌, టీవీరావు, యాదగిరి తదితరులు జేబీఎస్‌‌‌‌ బస్టాండ్‌‌‌‌ను తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన మొబైల్​ టాయిలెట్, కార్గో బస్సులను పరిశీలించారు.

Transport Minister Puvvada Ajay Kumar says RTC will no longer suspend and dismiss employees