కార్గో ద్వారా మూడేండ్లలో రూ.200 కోట్లు ఆదాయం: సంస్థ చైర్మన్​ బాజిరెడ్డి

కార్గో ద్వారా మూడేండ్లలో రూ.200 కోట్లు ఆదాయం: సంస్థ చైర్మన్​ బాజిరెడ్డి
  • ఆర్టీసీని ప్రైవేటుకు ఇవ్వం
  • సంస్థ ఆదాయం పెంచే ఆలోచనతో ముందుకెళ్తం: పువ్వాడ అజయ్
  •     జీవా వాటర్ బాటిల్స్​ లాంచ్ చేసిన మంత్రి 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయబోమని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఈ సంస్థ ప్రజల ఆస్తి అని, పేద, మధ్య తరగతి పబ్లిక్ వినియోగించేదని చెప్పారు. సంస్థ ఆదాయం పెంచే ఆలోచనలతో ముందుకెళ్తామన్నారు. సోమవారం ఎంజీబీఎస్​లో ఆర్టీసీ జీవా వాటర్ బాటిళ్లను చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్​, ఎండీ సజ్జనార్, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాసరాజుతో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రతి ఏటా ఆర్టీసీ 90 లక్షల వాటర్ బాటిళ్లను బయట నుంచి కొని వినియోగిస్తోందని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. టికెటేతర ఆదాయం పెంచుకునే దిశగా వాటర్ బాటిల్స్ వ్యాపారంలోకి సంస్థ అడుగుపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ‘జీవా’ వాటర్​ బాటిళ్లను ఆదరించాలని మంత్రి ప్రజలను కోరారు. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక 25 డిపోలను లాభాల్లోకి తెచ్చారని 
మెచ్చుకున్నారు.

ఆర్టీసీని లాభాల్లోకి తెస్తం: చైర్మన్ బాజిరెడ్డి

ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ రెవెన్యూ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. వాటర్ బాటిళ్ల వినియోగం ద్వారా ఏడాదికి రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నామని, జీవా బాటిళ్ల ద్వారా ఆ ఖర్చు తప్పుతుందని ఎండీ సజ్జనార్ చెప్పారు. త్వరలో ఆఫ్ లీటర్, 250 ఎంఎల్ బాటిళ్లనూ ప్రారంభిస్తామన్నారు. ఆర్టీసీకి 96 శాతం రెవెన్యూ టికెట్ల ద్వారానే వస్తోందని, గతంలో కంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. కార్గో ద్వారా మూడేండ్లలో రూ. 200 కోట్ల రెవెన్యూ వచ్చిందని, 34 పెట్రోల్ బంకుల ద్వారా రోజుకు రూ.90 లక్షల బిజినెస్ జరుగుతోందన్నారు.

సైబర్ లైనర్ బస్సుల ఓపెనింగ్

ఐటీ కారిడార్​లో మెట్రో స్టేషన్ల నుంచి సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఉద్యోగులు ప్రయాణించేలా పది  ‘సైబర్ లైనర్’ బస్సులను ఆర్టీసీ సోమవారం లాంచ్ చేసింది. సైబర్ టవర్స్ వద్ద బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వీటిని ప్రారంభించారు. 18 సీట్లున్న ఈ బస్సుల్లో ట్రాకింగ్​తో పాటు, వైఫై, ఏసీ సదుపాయం ఉందని తెలిపారు. రాయదుర్గం మెట్రో నుంచి డీఎల్ ఎఫ్, వేవ్ రాక్, జీఏఆర్ సాఫ్ట్ వేర్ పార్క్​లకు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆఫీస్ టైమింగ్స్​లో బస్సులు నడవనున్నాయి. ఈ సందర్భంగా బస్సుల్లో జర్నీ చేస్తున్న పలువురు ఐటీ ఉద్యోగులకు చైర్మన్, ఎండీ సన్మానించారు. బస్సుల్లో జర్నీ చేసి సంస్థను ఆదరించాలని ఉద్యోగులను అరెకపూడి కోరారు. అనంతరం ఆర్టీసీ కళాభవన్​లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం డైరీని బాజిరెడ్డి, సజ్జనార్​ ఆవిష్కరించారు.