ఇక నుంచి ‘మీ సేవ’లోనే ట్రాన్స్​పోర్ట్ పర్మిట్లు

ఇక నుంచి ‘మీ సేవ’లోనే ట్రాన్స్​పోర్ట్ పర్మిట్లు
  • నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
  • దరఖాస్తు చేసిన గంటలోనే పర్మిట్ అందజేత
  • దేశంలోనే తొలిసారి తెలంగాణలో..
  • కొత్త విధానంతో అక్రమాలకు చెక్
  • మీ సేవ 2.0 అందుబాటులోకి
  • 37 రకాల సర్టిఫికెట్ల కోసం ఇంటి నుంచే అప్లై

హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్ పోర్ట్ వాహనదారులకు శుభవార్త. ఇకపై నేషనల్, స్టేట్ పర్మిట్లు సులభంగా పొందవచ్చు. మీ సేవ కేంద్రాల్లోనే పర్మిట్లను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి అమలు కానుంది. కొత్త ప్రక్రియ ద్వారా పర్మిట్లు కేవలం గంటలోపే తీసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను మీ సేవ కేంద్రంలో అందజేసి, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. నేషనల్ పర్మిట్ కు ప్రస్తుతం ప్రభుత్వ ఫీజు ఏడాదికి రూ.17,500. దీనికి అదనంగా మీ సేవ యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. స్టేట్ పర్మిట్ కోసం రూ.1,100 ఫీజు చెల్లించాలి. పర్మిట్ల కోసం ఆర్సీ,  ఫైనాన్షియర్ నుంచి ఎన్ఓసీ, ఇన్సూరెన్స్, పొలుష్యన్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జత చేయాలి. ఫాం.42తోపాటు చెక్ స్లిప్ ను జత చేసి డాక్యుమెంట్లను సమర్పిస్తే వెంటనే పర్మిషన్ ఇస్తారు.

ఎక్కడైనా తీసుకోవచ్చు

మీ సేవలో ఇకపై ఎక్కడ నుంచైనా పర్మిట్లు తీసుకోవచ్చు. ఇప్పటివరకు పర్మిట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నప్పటికీ, వాహనం ఎక్కడ రిజిస్టర్ అయ్యిందో అక్కడే పర్మిట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో వాహనాల యజమానులు ఇబ్బందులు పడేవారు. చాలా వరకు ఇలాంటి వాహనాలు రిజిస్టర్ అయిన చోట కాకుండా వేరే ప్రాంతాల్లో నడిపిస్తుంటారు. దీంతో పర్మిట్ల కోసం రోజుల తరబడి ఆర్టీఏ కార్యాలయాల చుట్డు తిరగాల్సి వచ్చేది. దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి.

అక్రమాలకు చెక్

మీ సేవ కేంద్రాల్లో పర్మిట్లను అందుబాటులోకి తేవటంతో అక్రమాలకు బ్రేక్ పడనుంది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో పర్మిట్ల జారీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగేది. ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా కచ్చితంగా ఏజెంట్లను ఆశ్రయించక తప్పనిసరి పరిస్థితి. ఏజెంట్ల ద్వారా సంప్రదించిన వారికే త్వరగా పర్మిట్లు మంజూరయ్యేవి. ప్రతి పర్మిట్ కోసం వాహనాదారులు రూ.2 వేలు అదనంగా చెల్లించాల్సి ఉండేది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ విషయంలో చాలా వరకు డూప్లికేట్ పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకునే వారు కాదు. చాలా వరకు ఇన్సూరెన్స్ లు నకిలీవి అని తెలిసినా దానికి మరో రూ.వెయ్యి అదనంగా తీసుకొని పర్మిట్లు ఇచ్చేసే వారు.

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో

మీ సేవలో పర్మిట్ల విధానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉన్నా పలు కారణాల రీత్యా ఇది అమలు కాలేదు. అటు ఎన్నికల కోడ్ కారణంగానూ వాయిదా పడుతూ వచ్చింది. కొంతమంది రవాణా శాఖ అధికారులు కూడా ఈ నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విధానం సక్సెస్ అయితే ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు.

ఫస్ట్‌‌ అప్లికెంట్‌‌కే ఫస్ట్‌‌ సర్టిఫికెట్‌‌

మీ సేవ కేంద్రంలో క్యాస్ట్‌‌ సర్టిఫికెట్‌‌, ఇన్‌‌కమ్ సర్టిఫికెట్‌‌ లేదా మరేదైనా సర్టిఫికెట్ కోసం ఎవరు ముందు అప్లై చేస్తే సీరియల్‌‌ నంబర్‌‌ ప్రకారం వారికే ముందు సర్టిఫికెట్‌‌ జారీ చేసేలా సాఫ్ట్‌‌వేర్‌‌లో ఐటీ శాఖ అధికారులు మార్పులు చేశారు. దీంతో ముందు వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌‌లో పెట్టి.. పైసలు ఇచ్చిన వారి ఫైల్‌‌ను త్వరగా క్లియర్‌‌ చేసే అధికారుల అవినీతికి చెక్‌‌ పడే అవకాశముంది. తాజా మార్పులతో సిటిజన్‌‌ చార్టర్‌‌ ప్రకారం సర్టిఫికెట్లను నిర్ణీత గడువులోగా జారీ చేయాల్సిందే.

మీ సేవ 2.0

ప్రభుత్వ కార్యాలయాల నుంచి పొందే సర్టిఫికెట్లు, ఇతర ఆన్ లైన్‌‌ సేవల కోసం ఇప్పటి వరకు ఎవరైనా మీ సేవ కేంద్రాలకు, లేదా సంబంధిత కార్యాలయాలకు వెళ్లాల్సి ఉండేది. ఇక మీదట ఇంట్లోనే కూర్చుని దరఖాస్తు చేసుకునేలా ఐటీ శాఖ ఇటీవల ‘మీసేవ 2.0’ వెబ్‌‌వర్షన్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీసేవ వెబ్‌‌సైట్ ts.meeseva.telangana.gov.in ద్వారా ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌లో 2.0 సిటిజన్‌‌ సర్వీసెస్‌‌ను ఎంచుకుని పూర్తి వివరాలతో పేరు రిజిస్టర్‌‌ చేసుకుంటే అవసరమైన సేవలు పొందేందుకు వీల‌‌వుతుంది. రిజిస్టరయ్యాక 37 రకాల సర్టిఫికెట్ల కోసం ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు. అయితే సర్టిఫికెట్‌‌ ప్రింట్‌‌ మాత్రం మీ సేవ కేంద్రాల్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌‌లైన్‌‌ అప్లికేషన్‌‌ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉన్నా, స‌‌మస్యలు త‌‌లెత్తినా కాల్ సెంటర్‌‌(1100 లేదా 18004251110)కు ఫోన్ చేయ‌‌వ‌‌చ్చు. 9121006471 లేదా 9121006472 నంబర్లకు వాట్సాప్ చేసే స‌‌దుపాయం కూడా ఉంది.