అడ్డం తిరిగిన షిప్పుతో.. పెట్రోల్​ ధరలు పెరిగే చాన్స్​?

అడ్డం తిరిగిన షిప్పుతో..  పెట్రోల్​ ధరలు పెరిగే చాన్స్​?

అక్కడే చిక్కుకుపోయిన 34 చమురు రవాణా నౌకలు
తొందరగా క్లియర్​ చేయకపోతే సమస్యేనని దేశాల ఆందోళన

కైరో:ఒక్క షిప్పు.. ఆ ఒక్క పెద్ద షిప్పు ప్రపంచంలోని నౌకా రవాణా వ్యవస్థను ఆపేసింది. మంగళవారం సూయజ్​ కాల్వలో అడ్డంగా చిక్కుకుని.. అటూ ఇటూ నౌకలను జామ్​ చేసింది. ముందుకు పోనివ్వకుండా.. వెనక్కు వెళ్లలేకుండా చేసింది. దాదాపు 150 సరుకు రవాణా నౌకలు అక్కడే ఆగి పోయాయి. గురువారం కూడా అదే పరిస్థితి ఉంది. టగ్​ బోట్లు, డిగ్గర్లతో దానిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. 400 మీటర్ల పొడవున్న ‘ఎవర్​ గ్రీన్​’ అనే నౌక చైనా నుంచి నెదర్లాండ్స్​లోని రోటర్​ డ్యామ్​కు వెళుతుండగా బలమైన గాలులకు అడ్డం తిరిగింది. సరుకులతో ఫుల్లుగా ఉన్న ఆ షిప్పు 2 లక్షల టన్నుల బరువుంటుంది. దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని ఉత్తరాన ఉన్న మధ్యదరా సముద్రంతో ఈ సూయజ్​ కాలువే కలుపుతుంది. 
3.79 లక్షల చమురు కంటెయినర్లు అక్కడే..
ఇప్పుడు ఎవర్​ గ్రీన్ ఇరుక్కుపోవడంతో యూరప్​ దేశాలు, ఉత్తర అమెరికా దేశాలకు 3లక్షల79వేల కంటెయినర్ల ముడి చమురును తరలిస్తున్న 34 నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. దీంతో చాలా మంది వ్యాపారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియాలో చమురు వెలికి తీత తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సూయజ్​లో వీలైనంత తొందరగా ట్రాఫిక్​ను క్లియర్​ చేయకపోతే ధరలు మరింత పెరిగే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్​, యూరప్​ దేశాలకు సరుకు రవాణాపై ప్రభావం పడడంతో చాలా వ్యాపారాలపై దెబ్బ పడుతుందని చెబుతున్నారు. ఇక, షిప్​ అడ్డం తిరిగినప్పుడు ఎక్కువగా ఉన్న గాలివేగం ఆ తర్వాత తగ్గడంతో నౌకను పక్కకు తీసే ప్రయత్నాల్లో ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, షిప్​ అడ్డం తిరిగినందుకు ఆ షిప్​ యజమాని షూయి కిసెన్​ క్షమాపణలు చెప్పారు.