యుద్ధం ముంగిట ఇరాన్.. ఇజ్రాయెల్, దుబాయ్ విమానాలను నిలిపివేసిన గ్లోబల్ ఎయిర్‌లైన్స్

యుద్ధం ముంగిట ఇరాన్.. ఇజ్రాయెల్, దుబాయ్ విమానాలను నిలిపివేసిన గ్లోబల్ ఎయిర్‌లైన్స్

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న పోరు కారణంగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ మేఘాల నీడలో చిక్కుకుంది. ముఖ్యంగా యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ ఏవియేషన్ కంపెనీలైన ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, కెఎల్ఎమ్ వంటివి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాక్ గగనతలాన్ని ఉపయోగించకూడదని నిర్ణయించుకోవడం ఈ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది.

ALSO READ : ఇరాన్ వైపు అమెరికాయుద్ధనౌకలు ..

అమెరికా తన సైనిక శక్తిని మధ్యప్రాచ్యానికి భారీగా తరలించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేస్తోంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకతో పాటు యుద్ధ విమానాలు, వేలాది మంది సైనికులను వాషింగ్టన్ రంగంలోకి దించింది. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాన్‌ను హెచ్చరిస్తూ చేస్తున్న ఈ సైనిక మోహరింపుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన గగనతలాన్ని కొద్దిసేపు మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానాల మళ్లింపు, ఆలస్యాలు చోటుచేసుకున్నాయి. క్షిపణులు, డ్రోన్ల ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సంస్థలు అత్యంత అప్రమత్తంగా తమ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి.

ALSO READ : కెనడాకు పంపిన ఆహ్వానం వెనక్కి..

మరోవైపు ఇరాన్ అంతర్గత పరిస్థితులు కూడా అస్థిరంగా ఉన్నాయి. ఆ దేశంలో జరుగుతున్న నిరసనలు, వాటిపై ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలపై ఆంక్షలు ఉండటంతో వాస్తవ పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియడం లేదు. ఈ అంతర్గత అశాంతికి తోడు అమెరికా ఒత్తిడి తోడవ్వడంతో మధ్యప్రాచ్యం ఒక అగ్నిపర్వతంలాగా మారింది. భారతీయ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా కూడా ఈ ప్రభావానికి గురై తమ షెడ్యూళ్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ భౌగోళిక రాజకీయ మార్పులు కేవలం రవాణా రంగాన్నే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.