
- ఆర్టీసీ సమ్మెతో పండుగ పూట జనం ఇబ్బందులు
- తిరిగిన బస్సులు తక్కువ.. చార్జీలు ఎక్కువ
- సర్కారు నడిపిన బస్సూల్లోనూ డబుల్ వసూళ్లు
- హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొన్నా 30 నుంచి 40శాతం బస్సులను తిప్పలేకపోయారు. ఫలితంగా ప్రైవేట్ వాహనదారులు అన్ని జిల్లాల్లోనూ రెట్టింపు చార్జీలు వసూలుచేశారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. టికెట్ రేట్లు తాత్కాలిక కండక్టర్లకు అర్థం చేయించలేక చాలా డిపోల పరిధిలో బస్సుకు రూ.4వేలు, రూ.5వేలు టార్గెట్ పెట్టి పంపించారు. సాయంత్రం 6 గంటల కల్లా బస్సులను డిపోలకు చేర్చి, డ్యూటీచార్టులు అప్పగించాలని చెప్పినా కొందరైతే రాత్రి 9గంటలకూ అప్పగించలేదు.
కరీంనగర్ రీజియన్‌లో
కరీంనగర్ రీజియన్‌లో 641 ఆర్టీసీ, 207 అద్దె బస్సులుండగా, కేవలం 311బస్సులను తిప్పగలిగారు. ఆయా బస్సుల్లోనూ అధిక చార్జీలు వసూలుచేశారు. సిరిసిల్ల డిపోకు చెందిన 70 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌చేశారు. జగిత్యాలలో జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంథని నుంచి గోదావరిఖని వెళ్తున్న ప్రైవేటు బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దాలు పగిలి అందులో ప్రయాణిస్తున్న బాలుడి తలకు గాయమైంది.
వరంగల్ రీజియన్
వరంగల్ రీజియన్ పరిధిలో 712 ఆర్టీసీ, 230 అద్దె బస్సులు ఉండగా 435 నడపగలిగారు. ఆర్టీసీ అధికారులు అనుమతివ్వడంతో హన్మకొండ బస్టాండ్ లోకి కార్లు, టాటాసుమోలు, టాటాఏస్‌లు, తుపాన్వాహనాలు పెద్దసంఖ్యలో వచ్చాయి. కానీ రెండింతల చార్జీలు వసూలుచేశారు. హైర్బస్సుల్లోనూ దోపిడీ కొనసాగింది. జనగామ డిపో పరిధిలో తాత్కాలికంగా రిక్రూట్‌చేసుకున్న కండక్టర్లకు సాయంత్రం కల్లా రూ.5వేలు తీసుకురావాలని అధికారులు టార్గెట్పెట్టారు.
ఆదిలాబాద్ జిల్లా
పూర్వ ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 605 బస్సులుండగా ఆర్టీసీ ఆఫీసర్లు పోలీసుల సాయంతో 314 బస్సులను అతికష్టం మీద నడిపారు. డ్రైవర్లు, కండక్టర్లను టెంపరరీగా రిక్రూట్ చేసుకుని పోలీసు పహారా మధ్య తిప్పగలిగారు. కానీ ప్రయాణికులు లేకపోవడంతో బస్టాండ్లు బోసిపోయాయి. ప్రైవేట్ వాహనాలు రెట్టింపుచార్జీలు వసూలుచేశాయి. ఉట్నూర్ డిపో ఎదుట ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తాత్కాలిక డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.వెయ్యి ఇస్తామని చెప్పి, తీరా డ్యూటీ దిగాక ఇద్దరికీ కలిపి డిపోమేనేజర్ రూ.500 చేతిలో పెట్టారని ప్రశాంత్ అనే తాత్కాలిక కండక్టర్ నిర్మల్‌లో ఆరోపించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజామాబాద్ జిల్లా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో 671 బస్సులకుగాను శనివారం 328 బస్సులను తాత్కాలిక సిబ్బంది సాయంతో నడిపారు. ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బోధన్‌లో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.
మెదక్ జిల్లా
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా640 బస్సులకు గాను 449 బస్సులను నడిపారు. ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి రెండింతల చార్జీలను వసూలు చేశారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట డిపోల్లో నిరసనకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్ట్‌చేశారు. సంగారెడ్డి కంది శివారులో నేషనల్హైవేపై హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న సంగారెడ్డి డిపో బస్సు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి పారిపోయారు. సంగారెడ్డిలో నిరసనకు దిగిన కార్మికులను పోలీసులు చెదరగొట్టారు.
నల్గొండ జిల్లా
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ అధికారులు తాత్కాలిక కండర్లు, డ్రైవర్లను నియమించుకొని పోలీస్ బందోబస్తు నడుమ అద్దె బస్సులను నడిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా 7 డిపోల్లో 547 ఆర్టీసీ, 203 అద్దె బస్సులు ఉండగా, సమ్మెతో 302 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరుగగా పుష్పలత అనే మహిళా కండక్టర్ స్పృహ తప్పి పడిపోయింది. తాత్కాలిక డ్రైవర్ బస్సును తీస్తున్న క్రమంలో ఓ మహిళా కండక్టర్ చెప్పుతో కొట్టేందుకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం డిపోకు చెందిన తాత్కాలిక డ్రైవర్ హుస్సేన్ మద్యం సేవించి బస్సు నడుపుతుండగా గమనించిన ప్రయాణికులు కోదాడ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు మరో డ్రైవర్‌కు బస్సును అప్పగించారు.
ఖమ్మం జిల్లా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాత్కాలిక సిబ్బంది సాయంతో ఆర్టీసీ అధికారులు కేవలం200 బస్సులు మాత్రమే తిప్పగలిగారు. దీంతో ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలుచేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 693 బస్సులుండగా, కేవలం 294 బస్సులు నడపగలిగారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, నారాయణపేటలో పలు బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.