
ఇల్లు కట్టుకునే చోట చెట్లుంటే పడగొట్టేస్తుంటారు. చెట్లను కూల్చి, అందమైన ఇల్లు కట్టుకుంటారు. అయితే, కొందరు నేచర్ లవర్స్ మాత్రం చెట్లకూ తమ ఇంట్లో స్థానం కల్పిస్తుంటారు. చెట్లకు హాని చేయకుండా ఇల్లు కట్టుకుంటారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇప్పుడు అలా కట్టిన ఒక ఇల్లు అందరినీ ఆకర్షిస్తోంది. టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారింది.
‘ద సిటీ ఆఫ్ లేక్స్’గా పిలిచే ఉదయ్‌పూర్ ఎంతో అందంగా ఉంటుంది. చుట్టూ పెద్ద సరస్సు.. మధ్యలో అందమైన కట్టడాలు ఉదయ్‌పూర్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇప్పుడు ఈ ఆకర్షణల్లో మరోటి చేరింది. అదే ట్రీ హౌజ్. పెద్ద మామిడిచెట్టు చుట్టూ, నాలుగు అంతస్తులతో కట్టిన ఇల్లు ఇది. నలభై అడుగులున్న మామిడిచెట్టును పడగొట్టకుండా, కుల్ ప్రదీప్ సింగ్ అనే ఇంజనీర్ ఆ చెట్టు చుట్టూ కట్టించుకున్నాడు ఈ ఇల్లు. చిత్రకూట్ అనే ఏరియాలో ఉన్న ఈ మామిడి చెట్టు ఎనభై ఏళ్ల నాటిది కావడం విశేషం.
చెట్టుకు అనుగుణంగా ఇల్లు
ప్లాట్‌లో ఉన్న చెట్లను నరికితే తప్ప ఇల్లు కట్టుకోవడం కుదరదు అనుకుంటారు ఎవరైనా. కానీ, ప్రకృతి అంటే ఎంతో ఇష్టమైన కే.పీ. సింగ్ మాత్రం తన ప్లాట్‌లో ఉన్న మామిడి చెట్టును మాత్రం నరికేయాలి అనుకోలేదు. ఆ చెట్టును అలాగే ఉంచి, ఎలాంటి హాని కలగకుండా దాని చుట్టూ ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అలా చెట్టుకు అనుగుణంగా ఇంటి ప్లాన్ తయారుచేయించాడు. చెట్టు కొమ్మలను దృష్టిలో పెట్టుకుని, ఇంటిని డిజైన్ చేసుకున్నాడు. కొన్ని కొమ్మలను సోఫాగా, టీవీ స్టాండ్‌గా, కుర్చీగా కూడా మార్చుకున్నాడు. ఇంటిలోని అనేక రూమ్స్‌లో చెట్టు కొమ్మలు ఉన్నాయి. బాత్‌రూమ్, బెడ్‌రూమ్, కిచెన్ ఇలా అన్నింట్లో పెద్దగా ఎదిగిన కొమ్మలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇంట్లోనే పండ్లు కాస్తుండటం విశేషం.
ఖర్చు ఎక్కువ
చాలామందికి చెట్లు అంటే ఇష్టం. అయితే, ఇల్లు కట్టేటప్పుడు తప్పనిసరై చెట్లు నరికేస్తుంటారు. ఇంకొందరు వాటిని వేరే చోటుకు తీసుకెళ్లి, తిరిగి నాటుతుంటారు. కే.పీ.సింగ్ కూడా మామిడి చెట్టును ఇలాగే చేద్దామనుకున్నాడు. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆగిపోయాడు. అలాగని చెట్టుకు హాని చేయడానికి ఇష్టపడలేదు. దీంతో బిల్డర్‌తో మాట్లాడి, కొత్త ప్లాన్‌తో ఇల్లు కట్టాడు. ‘ఒకప్పుడు ఈ ప్రాంతంలో వేలాది మామిడి చెట్లు ఉండేవి. అయితే, సిటీ పెరగడంతో అందరూ చెట్లను నరికేసి ఇండ్లు కట్టుకున్నారు. కానీ, నేనలా చేయాలనుకోలేదు. అందుకే ఇలా ఇల్లు కట్టు కున్నా’ అని చెప్పాడు. ఇంటి మధ్యలో చెట్టున్నా, ఇంట్లో సౌకర్యాలకు మాత్రం ఏలోటూ లేదు. అన్ని రకాల వసతులు ఉన్నాయి. కిచెన్, లైబ్రరీ, లిఫ్ట్ వంటివి ఉన్నాయి. దేశంలో చాలా ట్రీ హౌజ్‌లు ఉన్నా, ఇది చాలా ప్రత్యేకమైంది. అందుకే
‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. చాలా ఏళ్ల క్రితం కట్టిన ఈ ఇంటిని ఇప్పుడు చాలామంది టూరిస్టులు చూసొస్తున్నారు.