గురుకులాల్లో పోస్టులు.. ఎందులో ఎన్నెన్ని అంటే

గురుకులాల్లో పోస్టులు.. ఎందులో ఎన్నెన్ని అంటే

హైదరాబాద్​, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్​ రెసిడెన్షియల్​ స్కూళ్లలో 9,231 పోస్టుల భర్తీకి గురువారం తెలంగాణ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్ రిక్రూట్​మెంట్​ బోర్డు (టీఆర్​ఈఐఆర్బీ) నోటిఫికేషన్​ను విడుదల చేసింది.  డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్​/ఫిజికల్​ డైరెక్టర్​/లైబ్రేరియన్​ పోస్టులు 868,  జూనియర్​ కాలేజీల్లో జూనియర్​ లెక్చరర్​/ఫిజికల్​ డైరెక్టర్​/లైబ్రేరియన్​ 2008,  పోస్ట్​ గ్రాడ్యుయేట్​ టీచర్స్​(పీజీటీ) 1,276, స్కూళ్లలో లైబ్రేరియన్​ 434, ఫిజికల్​ డైరెక్టర్​ 275, డ్రాయింగ్​/ఆర్ట్​ టీచర్స్​ 134, క్రాఫ్ట్​ ఇన్​స్ట్రక్టర్స్​/క్రాఫ్ట్​ టీచర్స్​ 92, మ్యూజిక్​ టీచర్లు 124, ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్​ టీచర్స్ (టీజీటీ)​ 4,020 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. అన్ని పోస్టులను టీఆర్​ఈఐఆర్బీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఈనెల 12 నుంచి ఓటీఆర్.. అన్ని  పోస్టులకు అప్లై చేసుకోవడానికి వన్​ టైం రిజిస్ట్రేషన్​ (ఓటీఆర్​) ఫెసిలిటీని ఈ నెల 12 నుంచి కల్పిస్తున్నట్టు రిక్రూట్​మెంట్​ బోర్డు తెలిపింది.

ఇంటర్​, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్​/జూనియర్​ లెక్చరర్​/ఫిజికల్​ డైరెక్టర్​/లైబ్రేరియన్​ పోస్టులకు ఈ నెల 17 నుంచి,  పోస్ట్​ గ్రాడ్యుయేట్​ టీచర్​ పోస్టులకు 24 నుంచి, ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్​ టీచర్ల పోస్టులకు 28 నుంచి అప్లికేషన్లకు అవకాశమివ్వనున్నారు. అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులకు చాన్స్​కల్పించారు.  ఎగ్జామ్​నిర్వహించే  తేదీలను మాత్రం వెల్లడించలేదు. ఇక, ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్​ టీచర్​ పోస్టుల భర్తీలో దివ్యాంగులు, సీనియర్​ సిటిజెన్స్​, ట్రాన్స్​జెండర్స్​ఎంపవర్​మెంట్​ డిపార్ట్​మెంట్​కు సంబంధించి పే స్కేల్​ను పెంచారు. రూ.45,960 నుంచి రూ.1,24,150 మధ్య పే స్కేల్​ను ఫిక్స్​ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల టీజీటీలకు మాత్రం రూ.42,300 నుంచి రూ.1,15,270గా నిర్ణయించారు.