ట్రెసా‑జేఏసీ నాయకుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ తమకు హామీ ఇచ్చారని, మంగళవారం నుంచి విధులకు హాజరవుతున్నామని ట్రెసా–రెవెన్యూ జేఏసీ నాయకులు ప్రకటించారు. సోమవారం ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను రెవెన్యూ జేఏసీ నాయకులు కలిశారు. తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం నేపథ్యంలో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత సీసీఎల్‌ఏ ఆఫీసులో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని, సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల రక్షణకు కూడా మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. మంత్రి హామీతో విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను రెండు వారాల్లో నెరవేర్చకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, ట్రెసా కార్యదర్శి గౌతమ్ కుమార్, వీఆర్వోల సంఘం నాయకులు గోల్కొండ సతీశ్, రవి నాయక్, విజయరావు, వీఆర్‌ఏల సంఘం నాయకులు రమేశ్ బహదూర్, రాజయ్య పాల్గొన్నారు.

