రుచీ పచి లేని పప్పు, నీళ్ల చారు

రుచీ పచి లేని పప్పు, నీళ్ల చారు
  • ఆశ్రమ పాఠశాల విద్యార్థుల నిరసన

కౌడిపల్లి, వెలుగు: రుచి పచి లేని పప్పు, నీళ్ల చారు తినలేక పోతున్నామని కౌడిపల్లిలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శుక్రవారం నిరసన తెలిపారు. భోజనం ఏమాత్రం బాగుండడం లేదని, ప్రతీరోజు నీళ్లచారు పెడుతున్నారని, అందులో పసుపు, కారం, ఎల్లిపాయ, ఉప్పు లేకుండా పప్పు ఉడకబెట్టి నీళ్లు పోసి పెడుతున్నారని తెలిపారు. భోజనం సరిగా ఉండడం లేదని హాస్టల్ వార్డెన్ ను అడిగితే .. పెట్టింది తినాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వారిని లేనిపోని డౌట్లు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నీళ్లలాంటి పప్పు పెట్టడంతో చాలా మంది విద్యార్థులు అన్నం తినకుండా పారబోశారు.

ఇదిలా ఉండగా వార్డెన్ జయరాజ్ 172 మందికి వండాల్సిన సరుకులు ఇవ్వకుండా 30 మంది మాత్రమే సరిపడ సరుకులు ఇస్తున్నారని వంట మనుషులు ఆరోపించారు. స్టోర్ రూమ్ కి తాళం వేసుకొని వెళ్తూ విద్యార్థులు స్కూల్ కి వెళ్లాక 11 గంటలకు హాస్టల్​కు వస్తే ఎలా వండి పెట్టాలని ప్రశ్నించారు. ఈ విషయమై జయరాజును వివరణ కోరగా ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నామని తెలిపారు.