V6 News

పోడు పట్టాల కోసం పోరు తప్పదు..గిరిజన సంఘం హెచ్చరిక

పోడు పట్టాల కోసం పోరు తప్పదు..గిరిజన సంఘం హెచ్చరిక

కొల్లాపూర్, వెలుగు : పోడు భూములకు పట్టాలిచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మానాయక్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో శనివారం నిర్వహించిన గిరిజన సంఘం మండల మహాసభలో ఆయనపాల్గొని, ఫారెస్ట్ భూముల్లో గిరిజనులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముక్కిడిగుండం ప్రాంతంలో సుమారు 70 మందికి సంబంధించి 300 ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గిరిజనులపై అటవీ శాఖ అధికారుల దాడులు పెరిగాయని మండిపడ్డారు.

పట్టాలిచ్చిన భూములకు బ్యాంకు రుణాలు, ఎరువులు అందించడంతో పాటు కృష్ణా నది నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 900 చెల్లించాలని, 200 రోజులు పని కల్పించాలని, 2027 జనగణనలో షెడ్యూల్డ్ ట్రైబ్స్‌‌‌‌‌‌‌‌ను ప్రకృతి ఆరాధకులుగా గుర్తించేలా ప్రత్యేక కాలమ్‌‌‌‌‌‌‌‌ను చేర్చాలని కోరారు. అనంతరం 17 మందితో కూడిన గిరిజన సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.